
రైలు ప్రయాణంలో ఆహారం అందుబాటులోఉండదు. దీంతో అవసరమైనప్పుడు ఐఆర్‌సీటీసీ పోర్టల్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కొన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ ట్రైన్లలోని ప్రయాణికులకు కూడా డెలివరీ సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్స్ రైల్వేశాఖ, ఐఆర్‌సీటీసీ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి లభించిన తర్వాతనే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫ్లాట్‌ఫామ్స్ ఎలాంటి అనుమతి లేకుండా ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. ఇలాంటి వెబ్ సైట్స్ లేదా యాప్స్ ద్వారా బుక్ చేసుకోవడం వల్ల ఆహారం నాణ్యత లేకపోవడంతో పాటు ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు లీక్ కావడం, ఆరోగ్యం, ఆర్ధిక నష్టాలకు దారితీసే అవకాశముంటుంది. దీంతో ఇలాంటి అనధికార యాప్స్ పట్ట అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న ఐఆర్‌సీటీసీ.. తాజాగా పలు వెబ్‌సైట్లను బ్యాన్ చేసింది. పొరపాటున కూడా ఈ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దని హెచ్చరించింది.
రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అలర్ట్ జారీ చేసింది. ఐఆర్‌సీటీసీ అనుమతి మంజూరు చేసిన ఫుడ్ అగ్రిగేటర్ల జాబితాను విడుదల చేసింది. జొమాటో, స్విగ్గీ, రైల్ యాత్రి, రైల్ రెసిపీ, జూప్, ఫుడ్ ఆన్ ట్రాక్ లాంటి రైల్వేశాఖ గుర్తించిన యాప్స్ నుంచి మాత్రమ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలని సూచించింది. ఐఆర్‌సీటీసీ ఈ క్యాటరింగ్ వెబ్ సైట్, ఐఆర్‌సీటీసీ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ హెల్ప్ లైన్ నెంబర్ 1323కి కాల్ చేసి మీ పీఎన్‌ఆర్ నెంబర్ చెప్పడం ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే ఫుడ్ డెలివరీ చేస్తారు. ఐఆర్‌సీటీసీ గుర్తింపు పొందిన ఫుడ్ అగ్రిగేటర్లు అందించే ఆహారంపై రైల్వేశాఖ దృష్టి పెడుతుంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు, పరిశీలన ఉంటుంది. అదే అనధికారిక వెబ్ సైట్ల ద్వారా బుకింగ్ చేసుకుంటే వ్యక్తిగత వివరాలకు భద్రత ఉండదు. మీ బ్యాంక్ వివరాలు, మొబైల్ నెంబర్లు వంటివి చోరీకి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఫుడ్ లైసెన్సులు లేని రెస్టారెంట్ల నుంచి ఆహారం సరఫరా చేయడం వల్ల అనారోగ్యానికి గురి కావొచ్చు. అనధికార యాప్స్‌లలో కస్టమేర్ కేర్ సిబ్బందిని ఆశ్రయించే ఫీచర్ లేకపోవడం వల్ల మీ డబ్బును కోల్పోవడం, రీఫండ్ రాకపోవడం వంటివి ఎదురుకావొచ్చు.
రైల్‌రెస్ట్రో.కామ్, రైల్ రెస్ట్రో.ఇన్, రైల్మిత్ర.కామ్, ట్రావెల్‌ఖానా.కామ్, ట్రైన్స్‌కేఫ్.కామ్, డిబ్రైల్.కామ్, రైల్ ఫుడ్.నెట్, ట్రావెలర్‌ఫుడ్.కామ్, FOODONTRACK.IN, ECATERING.APP, ఖానాఆన్‌లైన్.ఇన్, TRAINWAY.IN, రైల్మీల్.కామ్, ట్రైన్‌మెనూ.కామ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై ఐఆర్‌సీటీసీ నిషేధం విధించింది.