Gold Bands: గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి.. అందులో పెట్టుబడి పెట్టడం మంచిదేనా..

|

Feb 26, 2022 | 6:59 AM

సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడికి గోల్డ్ బాండ్లు(Gold bonds) మంచి ఎంపిక. అయితే ఈ గోల్డ్ బాండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకురారు...

Gold Bands: గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి.. అందులో పెట్టుబడి పెట్టడం మంచిదేనా..
Gold Bonds
Follow us on

సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడికి గోల్డ్ బాండ్లు(Gold bonds) మంచి ఎంపిక. అయితే ఈ గోల్డ్ బాండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకురారు. దానికి సమయం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016లో సావరిన్ గోల్డ్‌ బాండ్ల(sovereign gold bonds)ను ప్రారంభించింది. ఆ సమయంలో ఈ కొత్త పెట్టుబడి పథకం గురించి చాలా మంది గందరగోళానికి గురయ్యారు. అయితే హైదరాబాద్‌ చెందిన ఆనంద్‌కు ఈ పథకం నచ్చింది. అతను సావరిన్ గోల్డ్ బాండ్ అంటే SGBలో 100 గ్రాముల బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు ఈ బాండ్ రీడీమ్ చేసుకున్న తర్వాత అతను భారీ లాభాలను ఆర్జించారు. సావరిన్ గోల్డ్ బాండ్ ప్రభుత్వ పథకం. ఇది భౌతిక బంగారానికి ప్రత్యమ్నయంగా ఉంటుంది. ఈ బాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది.

2016 జనవరిలో గోల్డ్ బాండ్లను జారీ చేసినప్పుడు ఒక గ్రాము బంగారం ధర రూ.2600గా ఉంది. ఆ సమయంలో ఆనంద్ రూ.2.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ బాండ్ మెచ్యూరిటీ ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. ఐదేళ్ల తర్వాత దీన్ని రీడీమ్ చేసుకోవచ్చు. ఆర్‌బీఐ తొలిసారి ప్రీమెచ్యూరిటీ ఆప్షన్‌ కూడా ఇచ్చింది. ఇందుకోసం ఒక్కో యూనిట్ ధర రూ.4,813గా నిర్ణయించింది. బంగారం గత వారం ముగింపు ధర సగటును తీసుకొని ఈ ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతం జనవరి 31, ఫిబ్రవరి 4, బంగారం సగటు ధరతో దీన్ని నిర్ణయించారు. ప్రీ-మెచ్యూర్ రిడెంప్షన్ సౌకర్యం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అందుబాటులో ఉంటుంది.

100 గ్రాముల బంగారం బాండ్లు విక్రయించినప్పుడు.. ఆనంద్ రూ.4,81,300 పొందాడు. తన పెట్టుబడి రూ.2.6 లక్షలపై.. రూ.2,21,300 లాభం పొందాడు. ఇది మాత్రమే కాదు. ఈ పెట్టుబడిపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఆనంద్‌కు వడ్డీ రూపంలో ఇప్పటికే రూ.32,500 సంపాదించాడు. ఈ విధంగా రూ.2,60,000 పెట్టుబడిపై ఐదేళ్లలో మొత్తం రూ.2,53,800 సంపాదించాడు. అంటే ఆనంద్‌కి దాదాపు 98 శాతం లాభం వచ్చిందన్న మాట. RBI ద్వారా SGBలను రీడీమ్ చేసినప్పుడు లాభాలపై పన్ను ఉండదు. ఈ విధంగా ఆనంద్ తన ఆదాయం 2,21,300పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ బాండ్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా విక్రయించినట్లయితే, దాని నుంచి వచ్చే రాబడి.. క్యాపిటల్ గెయిన్స్ విభాగంలోకి వస్తుంది. ఈ బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాల ముందు విక్రయించినట్లయితే… ఈ బాండ్ నుండి వచ్చే రాబడిని స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈ ఆదాయాన్ని పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి జోడిస్తారు. స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అదే బాండ్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే.. ఈ రాబడి దీర్ఘకాలిక మూలధన లాభం కేటగిరీలో వస్తుంది. దీనికి 20 శాతం పన్ను విధిస్తారు. అయితే ప్రతి సంవత్సరం సంపాదించిన వడ్డీ పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుపుతారు. దానిపై అతను తన స్లాబ్ ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పెట్టుబడి కోసం సావరిన్ గోల్డ్ బాండ్‌పై పెట్టుబడి పెట్టడం ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టడం లాంటిదని పన్ను, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పారు. ఈ బాండ్ తప్పనిసరిగా మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలన్నారు. పిల్లల పెళ్లిళ్లకు కావాల్సిన బంగారం అవసరాలను తీర్చేందుకు ఇది ఉపయోగపడే పథకం. మీకు కొడుకు లేదా కుమార్తె ఉన్నారా అనేది ముఖ్యం కాదు. పిల్లల పెళ్లికి బంగారం కావాలి. గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ఇందుకు మంచి ఎంపిక.

ప్రయోజనాలు ఏమిటంటే.. SGBలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. రుణం తీసుకోవడానికి ఈ బాండ్‌ను పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. అది దొంగిలించే ప్రమాదం లేదు. ఇందులో, బంగారం ధరల పెరుగుదల కారణంగా మీరు లాభం పొందుతారు. వడ్డీ రూపంలో అదనపు ఆదాయాలు కూడా పొందుతారు. బాండ్లను కొనుగోలు చేసేటప్పుడు ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి గ్రాముకు రూ.50 తగ్గింపు అందుబాటులో ఉంది. ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తే అందులో మేకింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ గోల్డ్ బాండ్లలో జీఎస్టీ లేదు.

Read Also..  Gold Silver Price Today: మగువలకు గూడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..