వార్‌ ఎఫెక్ట్‌.. భారత రూపాయి బలపడుతుందా? విలువ పడిపోతుందా?

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదలతో భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 92.58కి పడిపోయి రికార్డు కనిష్ట స్థాయిని తాకింది. డాలర్ బలం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం దీనికి కారణం. గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనాల ప్రకారం రూపాయి 95కి చేరవచ్చు, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని హెచ్చరించింది.

వార్‌ ఎఫెక్ట్‌.. భారత రూపాయి బలపడుతుందా? విలువ పడిపోతుందా?
Indian Rupee

Updated on: Mar 19, 2026 | 5:22 AM

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల ఎగబాకడం ప్రభావంతో భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి సర్వకాలిక కనిష్ట స్థాయికి పడిపోయి 92.58 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్లలో డాలర్ బలపడటం, అలాగే విదేశీ పెట్టుబడులు దేశం నుంచి బయటకు వెళ్లడం రూపాయి పతనాన్ని మరింత వేగవంతం చేశాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 92.42 వద్ద ప్రారంభమై, రోజు మొత్తం 92.46–92.47 పరిధిలో కదిలి, చివరికి 18 పైసలు పడిపోయి 92.58 వద్ద స్థిరపడింది. మంగళవారం కూడా రూపాయి తన మునుపటి కనిష్ట స్థాయిని తాకి 92.40 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం చమురు ధరల పెరుగుదలతో దిగుమతి ఖర్చులు పెరగడం, మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడటానికి ప్రధాన కారణాలు.

ఈ పరిస్థితుల్లో గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది రూపాయి విలువ 95 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాను 7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందని కూడా సూచించింది. కరెంట్ అకౌంట్ లోటు (CAD) జీడీపీలో 1.2 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

మార్కెట్ నిపుణులు చెబుతున్నదేమిటంటే, పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగితే, చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది రూపాయిపై అదనపు ఒత్తిడిని సృష్టించవచ్చు. RBI ఇప్పటివరకు రూపాయి పతనాన్ని నియంత్రించడానికి ప్రత్యక్ష జోక్యం పరిమితంగానే ఉంచింది. అయితే పరిస్థితులు మరింత దిగజారితే, ద్రవ్య విధాన పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రూపాయి బలహీనతకు గ్లోబల్ అంశాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు రూపాయి దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us