రైల్వే స్టేషన్‌లో త్రాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? RO సిస్టమ్ ఉంటుందా?

రైల్వే స్టేషన్లలో తాగునీరు బోర్‌వెల్స్‌, బావులు, నదులు, కాలువలు లేదా మున్సిపల్‌ సరఫరా నుంచి వస్తుంది. అవసరాన్ని బట్టి ఫిల్టరేషన్‌, క్లోరినేషన్‌ వంటి పద్ధతులతో శుద్ధి చేస్తారు. ప్రతి స్టేషన్‌లో RO ఉండదు. pH, TDS, టర్బిడిటీ, కాఠిన్యం, ఫ్లోరైడ్‌, సూక్ష్మజీవుల వంటి ప్రమాణాలను పరీక్షిస్తారు.

రైల్వే స్టేషన్‌లో త్రాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? RO సిస్టమ్ ఉంటుందా?
Drinking Water In Railway Station

Updated on: Aug 20, 2026 | 7:36 PM

చాలా మంది రైల్వే స్టేషన్స్‌లో రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి, రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.30 ఇచ్చి కొంటూ ఉంటారు. అయితే అలా కొనలేని లక్షల మంది రైల్వే స్టేషన్‌లో ఉండే వాటర్ ట్యాబ్ వద్ద నీళ్లు పట్టుకొని తాగుతుంటారు. ఈ బాటిల్స్ రాకముందు దాదాపు అందరూ అవే తాగే వారు. కానీ ఉచితంగా వాటర్ ఉన్నా, బాటిల్స్ కొని తాగేలా చేసింది పెట్టుబడిదారి వ్యవస్థ. ఆ విషయం పక్కనపెడితే.. అసలు రైల్వే స్టేషన్‌ త్రాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నేరుగా మున్సిపల్‌ పైప్‌లైన్‌ నుంచే వస్తుందా? లేక రైల్వే అధికారులు ప్రత్యేకంగా శుద్ధి చేస్తారా? ప్రతి స్టేషన్‌లో RO ప్లాంట్‌ ఉంటుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రైల్వే స్టేషన్లకు నీరు ఎక్కడి నుంచి?

అన్ని రైల్వే స్టేషన్లకు ఒకే మూలం నుంచి నీరు సరఫరా కాదు. స్టేషన్‌ ఉన్న ప్రాంతం, స్థానిక నీటి లభ్యతను బట్టి బోర్‌వెల్స్‌, బావులు, నదులు, కాలువలు వంటి వనరుల నుంచి నీటిని తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు సరిపోకపోతే స్థానిక మున్సిపల్‌ సంస్థల నుంచి కూడా నీటిని పొందుతారు. అంటే స్టేషన్‌లోని కుళాయి నుంచి వచ్చే నీరు తప్పనిసరిగా మున్సిపల్‌ పైప్‌లైన్‌ నుంచే రాదు.

నేరుగా కుళాయిలోకి పంపిస్తారా?

నీటిని మూలం నుంచి తీసుకున్న వెంటనే ప్రయాణికులకు తాగేందుకు అందించరు. అవసరాన్ని బట్టి నీటిని వడపోత, క్లోరినేషన్‌ తదితర శుద్ధి ప్రక్రియలు చేపడతారు. అనంతరం శుద్ధి చేసిన నీటిని నిల్వ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా స్టేషన్‌లోని వాటర్‌ కూలర్లు, కుళాయిలు, ఇతర అవసరమైన ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు.

ప్రతి స్టేషన్‌లో RO ప్లాంట్‌ ఉంటుందా?

ఇక్కడ చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇచ్చే ప్రతి నీరు తప్పనిసరిగా RO ద్వారా శుద్ధి చేసినదే అని. కానీ అలా కాదు. ప్రతి స్టేషన్‌లో RO వ్యవస్థ ఉండదు. నీటి మూలం, స్థానిక నీటి నాణ్యత, అందుబాటులో ఉన్న శుద్ధి సదుపాయాలను బట్టి ఫిల్ట్రేషన్‌, క్లోరినేషన్‌ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి అదనపు శుద్ధి వ్యవస్థలు కూడా ఉండవచ్చు.

నీటిలో ఏం పరీక్షిస్తారు?

రైల్వే నీటి నాణ్యతను నిర్ధారించేందుకు పలు ప్రమాణాలను పరిశీలిస్తుంది. pH, TDS, టర్బిడిటీ, కాఠిన్యం, ఫ్లోరైడ్‌ వంటి భౌతిక, రసాయనిక పరామితులతో పాటు సూక్ష్మజీవుల ఉనికిని కూడా పరీక్షించడం కీలకం. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నీటినే తాగునీటిగా సరఫరా చేయాలి.

ప్రయాణికులు ఏం చేయాలి?

రైల్వే స్టేషన్‌లో నీరు తాగేటప్పుడు శుభ్రతపై కూడా దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా వాటర్‌ కూలర్‌ నాజిల్‌, పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తే జాగ్రత్త వహించాలి. వీలైతే ప్రయాణ సమయంలో సురక్షితమైన తాగునీటిని వెంట తీసుకెళ్లడం కూడా మంచిదే.

Loading...
Unable to load recommendations.
Follow Us