Gold Hallmark News: దేశ వ్యాప్తంగా బంగారు నగల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం రేపు(15 జూన్) నుంచి అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్కింగ్ తప్పనిసరికానుంది. 2019 నవంబరులో హాల్ మార్క్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో తొలిసారిగా జనవరి 15 వరకు హాల్ మార్క్ అమలుకు జ్యువలరీ దుకాణాలకు కేంద్రం గడువు ఇచ్చింది. కరోనా వల్ల తమ వ్యాపారం దెబ్బతిన్నదని సమయం పొడిగించాలని కోరిన ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (ఎజిజెడిసి), ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ముందుగా జూన్ 1 వరకు.. కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తిరిగి జూన్ 15 వరకు గడువు పొడిగించారు. రేపటి నుంచి హాల్ మార్క్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్ ఉద్దేశం. ఇప్పటికే హాల్ మార్కింగ్ నగలనే పెద్ద పెద్ద ఆభరణ వర్తకులు విక్రయిస్తున్నారు.
హాల్‌మార్కింగ్ అంటే ?
కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ప్రమాణాలు పెట్టింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని ప్రభుత్వం…బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్ నగలను గుర్తించడం కష్టమవుతోంది. గోల్డ్ ఒరిజినల్, నకిలీవి అనేది తెలియదు. కొందరు చూడగానే గుర్తిస్తారు మరికొందరు ఇబ్బంది పడతారు. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్ విధానాన్ని కేంద్రం తీసుకొస్తోంది.
కేంద్రం నిర్ణయంతో 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్కింగ్ ఉన్న బంగారు అభరణాలను మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. హాల్‌మార్కింగ్ లేని నగలు అమ్మడానికి వీలులేదు. మార్కింగ్ లేని నగలు అమ్మితే… సదరు వర్తకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్కింగ్ లేని నగలు కూడా లభ్యమవుతున్నాయి. కస్టమర్లు కూడా హాల్ మార్క్ ఉన్న బంగారు నాణేలు, ఆభరణాలనే కొనుగోలు చేయాలి. బంగారు ఆభరణం మీద బీఐఎస్ హాల్ మార్క్ ను కలిగి ఉంటేనే దాన్ని బంగారు స్వచ్ఛతకు ప్రామాణికంగా పరిగణించాలి. హాల్ మార్క్ నగలను విక్రయించే దుకాణాల పూర్తి జాబితాను బీఐఎస్ వెబ్ సైట్ లో చూడవచ్చు. బంగారు హాల్ మార్క్ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా బీఐఎస్‌ను సంప్రదించవచ్చు.
కొనుగోలుదారులు ఇక మీదట హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా కావాలని వర్తకుల నుంచి అడిగి మరీ తీసుకోవాలి.
మీరు కొనుగోలు చేసిన నగల స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఈ సెంటర్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లోనూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ వెబసైట్ వాడుకోవచ్చు https://bis.gov.in/ ప్రస్తుతం 40 శాతం మాత్రమే బంగారు అభరణాలు హాల్ మార్క్ నిబంధనలు పాటిస్తున్నాయి. ఈ విధానం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దేశంలోని 234 జిల్లాల్లో 877 హాల్ మార్క్ కేంద్రాలున్నాయి.
విక్రయదార్లు ఏం చేయాలంటే…
బంగారం ఎక్కడ తయారయినా, విక్రయించినా హాల్ మార్క్ తప్పనిసరి. విక్రేతలు అందరూ BIS వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. హాల్ మార్క్ చేసిన ఆభరణాలు, కళాఖండాలే విక్రయించాలి. లేదంటే రూ.1 లక్ష నుంచి బంగారం విలువపై అయిదు రెట్ల జరిమానా విధిస్తారు. ఏడాది జైలు శిక్ష ఉంటుందని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.
ప్రతి జువెలరీ షాపులో మూడు రకాల క్యారెట్ల నగల రేట్లను బోర్డులో చూపించాలి. ఒక్కో కస్టమర్‌కి ఒక్కో రేట్ చెబితే కుదరదు. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్ని తమ దుకాణాల్లో రిటైలర్లు తప్పనిసరిగా ప్రదర్శంచాలి. హాల్ మార్క్ ఉన్న నగలనే తప్పనిసరిగా విక్రయించాలి. వినియోగదారుల నుంచి ఎలా కొన్నా, వాటిని కరిగించి తిరిగి ఇచ్చేటప్పుడు హాల్ మార్క్‌తో మూడు రకాల స్వచ్ఛతతో ఇవ్వాలి. ఓ ఆభరణానికి హాల్ మార్క్ వేసేందుకు రూ.50 మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదారులకు మాత్రం తాము చెల్లించిన డబ్బుకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారం లభ్యమవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. జూన్ 15 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలు మాత్రమే వర్తకులు విక్రయించాలి. ఇష్టమొచ్చినట్లు క్యారెట్లు నిర్ణయించడం కూడా నేరమే అవుతుంది.
ప్రజల దగ్గరుంటే పాత బంగారానికి హాల్ మార్క్ లేకపోయినా వారు ఎప్పుడైనా సరే దాన్ని అమ్ముకోవచ్చని కేంద్రం తెలిపింది. పాత బంగారాన్ని కొన్న వ్యాపారులు తిరిగి అమ్మేటప్పుడు దాన్ని కరిగించి హాల్ మార్క్‌తో నగలు తయారుచేసి అమ్మాల్సి ఉంటుంది. నగలు అమ్మేటప్పుడు ఏ క్యారెట్ ప్రకారం అమ్మారో చెబుతూ, ఎంత డబ్బు తీసుకున్నారో ఆ వివరాలతో సర్టిఫికెట్ ఇవ్వాలి.
ఆన్ లైన్లో హాల్ మార్కింగ్ ఎలా?….
బంగారం అమ్మకం కోసం ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. www.manakonline.in వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి కొంత ఫీజు ఉంటుంది. జువెలరీ సంస్థ టర్నోవర్ ప్రాతిపదికన చెల్లించాల్సిన ఫీజు కూడా మారుతుంది. దీని ప్రారంభ ధర రూ.7,500. రిజిస్టర్డ్ జువెలరీ సంస్థలు బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ అండ్ హెచ్ సెంటర్‌కు హాల్ మార్కింగ్ కోసం ఆభరణాలు పంపాలి.
ఇవి కూడా చదవండి..జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా.. మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త!