
ఇప్పటిరోజుల్లో సొంతిల్లు అనేది ప్రతీఒక్కరి చిరకాల కల. తమకంటూ మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ పడుతుంటారు. తమ ఆర్ధిక స్తోమత సరిపోక బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి బ్యాంకులు సులువుగా రుణాలు అందిస్తుంటాయి. దీంతో బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐల రూపంలో ప్రతీ నెలా తమ జీతం నుంచి చెల్లిస్తుంటారు. అయితే పీఎఫ్ బ్యాలెన్స్‌తో కూడా హోమ్ లోన్ చెల్లించవచ్చు. హోమ్ లోన్ చెల్లించేందుకు పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఖాతాదారులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. తమ బ్యాలెన్స్‌లో కొంత భాగాన్ని కొత్త ఇల్లు నిర్మించుకోవడం, ఫ్లాట్ కొనుగోలు చేయడం, హోమ్ లోన్ చెల్లించడం కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటీవల ఈ నిబంధనలను ఈపీఎఎఫ్ఓ మరింత సరళతరం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం కనీసం 12 నెలల ఈపీఎఫ్ఓ సర్వీస్ పూర్తి చేస్తే గృహ రుణం కోసం పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసినవారికి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని తగ్గించారు. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసి ఉంటే మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం సొమ్మును తీసుకోవచ్చు. కనీసం 25 శాతం మొత్తాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు పీఎఫ్ నిల్వ రూ. 10 లక్షలు ఉంటే రూ.7.50 లక్షల వరకు మీరు విత్ డ్రా చేసుకుని హోమ్ లోన్ తీర్చవచ్చు. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించడం, ఇప్పటికే ఉన్న ఇంటి లేదా ఫ్లాట్‌కు మరమ్మత్తులు, పునరుద్ధరణ లేదా మెరుగులు దిద్దటం వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ఉద్యోగి తమ సర్వీసు కాలంలో గరిష్టంగా ఐదు సార్లు గృహ అవసరాల కోసం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే విత్ డ్రా చేసే అమౌంట్‌పై ట్యాక్స్ అనేది మీ సర్వీస్‌ను బట్టి ఉంటుంది. మీరు మొత్తం 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే విత్ డ్రాలపై ఎలాంటి పన్ను ఉండదు. టీడీఎస్ కట్ చేయరు. మొత్తం సర్వీస్ పదేళ్ల కంటే తక్కువగా ఉండి రూ.50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. మీ హోమ్ లోన్ వడ్డీ రేటు పీఎఫ్ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటే పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకుని చెల్లించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ నిధులపై వడ్డీ, చక్రవడ్డీ లాంటివి అందుతాయి. దీంతో పీఎఫ్ అకౌంట్లో నిధులు ఉంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో పొదుపు పెరుగుతుంది. అవసరమైతే తప్పు విత్ డ్రా చేసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.