AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిపై ఉన్న బంగారాన్ని ప్రపంచమంతా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది..?

బంగారం కొనాలంటేనే సామాన్యుడు తులాల లెక్కన బడ్జెట్ వేసుకునే రోజులివి. అలాంటిది భూమ్మీద ఉన్న బంగారమంతా తీసి ప్రపంచంలోని ప్రతి మనిషికీ సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంతొస్తుంది? ఎవరైనా కుబేరులైపోతారా లేక కొన్ని గ్రాములతోనే సరిపెట్టుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే ఇప్పటివరకు మనుషులు తవ్విన బంగారం లెక్క ఒకలా ఉంటే.. ఎవరికీ అందకుండా భూమి గర్భంలో దాగి ఉన్న అసలైన పసిడి నిధి లెక్కలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి.

భూమిపై ఉన్న బంగారాన్ని ప్రపంచమంతా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది..?
How Much Gold Is On Earth
Krishna S
|

Updated on: Oct 16, 2026 | 5:03 PM

Share

బంగారం అంటే భారతీయులకే కాదు, ప్రపంచం మొత్తానికీ ఎనలేని మక్కువ. తులం బంగారం కొనడానికే సామాన్యుడు నెలల తరబడి లెక్కలు వేసుకునే ఈ రోజుల్లో.. అసలు భూమ్మీద ఉన్న బంగారమంతా తీసి ప్రపంచ జనాభాకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంతొస్తుంది? ఎవరైనా కుబేరులైపోతారా లేక కొన్ని గ్రాములతోనే సరిపెట్టుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే రెండు మైండ్ బ్లోయింగ్ నిజాలు బయటపడతాయి. ఒకటి.. ఇప్పటివరకు మనుషులు తవ్వి తీసిన బంగారం లెక్క, రెండోది.. ఎవరికీ అందకుండా భూమి గర్భంలో దాగి ఉన్న అసలు సిసలు నిధి లెక్క..

ఇప్పటివరకు తవ్వి తీసిన బంగారం పంపకం

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం.. మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకు భూమి పొరల్లోంచి తవ్వి తీసిన మొత్తం బంగారం సుమారు 2,12,000 నుండి 2,15,000 మెట్రిక్ టన్నులు. ఇందులో నగల రూపంలో ఉన్నది, ప్రభుత్వాల రిజర్వులు, ప్రైవేట్ లాకర్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో వాడిన బంగారం అంతా కలిసి ఉంది. ఈ 2.15 లక్షల టన్నుల బంగారాన్ని అంతా ఒకే చోట కరిగించి పోతపోస్తే, అది కేవలం 22 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఒక చిన్న క్యూబ్‌లా మాత్రమే మారుతుంది. అంటే ఒక సాధారణ 7 అంతస్తుల భవనం సైజు మాత్రమే. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు. ఈ మొత్తం బంగారాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా పంచితే.. ఒక్కొక్కరికి వచ్చేది కేవలం సుమారు 26 నుంచి 27 గ్రాములు మాత్రమే. అంటే దాదాపు రెండున్నర తులాల బంగారం. ఇక ఇంకా భూమిలో మిగిలి ఉండి, భవిష్యత్తులో తవ్వితీసే అవకాశం ఉన్న బంగారం మరో 50,000 టన్నుల వరకు ఉండొచ్చని అంచనా. అది కూడా కలిపినా ఒక్కొక్కరికి గరిష్టంగా మరో అర తులం మాత్రమే అదనంగా వస్తుంది.

భూమి గర్భంలో దాగున్న అసలు నిధి

ఇక్కడే అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. భూమి ఉపరితలంపై మనం చూస్తున్న బంగారం అసలైన సంపదలో ఒక చిన్న రవ్వంత మాత్రమే. అసలైన బంగారమంతా భూమి లోపలి కేంద్రకంలో దాగి ఉంది. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడుతున్న సమయంలో మొత్తం గ్రహం ఒక మండుతున్న ద్రవ రూపంలో ఉండేది. ఆ తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో ఇనుము, బంగారం, ప్లాటినం లాంటి అత్యంత బరువైన లోహాలన్నీ గ్రావిటీ వల్ల భూమి అట్టడుగు కేంద్ర భాగంలోకి మునిగిపోయాయి.

ఎంత బంగారం ఉంది?

భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి కేంద్రంలో ఉన్న బంగారం ఎంతంటే.. దాన్ని బయటకు తీసి ప్రపంచ ఉపరితలంపై పరిస్తే, భూగోళం మొత్తాన్ని ఏకంగా 1.5 అడుగులమందపాటి బంగారు పొరతో కప్పేయవచ్చు.ఈ భూగర్భ బంగారాన్ని లెక్కగట్టి ప్రపంచ జనాభాకు పంచితే.. ఒక్కొక్కరికి తులాల లెక్కన కాదు ఏకంగా సుమారు 4 టన్నుల పసిడి అందుతుంది. ప్రతి మనిషీ శతకోటీశ్వరుడు అయిపోవచ్చు.

ఆ బంగారాన్ని తవ్వి తీయడం సాధ్యమేనా?

అయితే ఆ భూగర్భ బంగారాన్ని బయటకు తీసుకురావడం మానవమాత్రులకు అసాధ్యం. ఎందుకంటే ఆ నిధి దాదాపు 3,000 కిలోమీటర్ల లోతులో, సూర్యుడి ఉపరితలంతో సమానమైన వేడి, భరించలేని పీడనం మధ్య ఉంది. ఇప్పటివరకు మానవుడు తవ్విన అత్యంత లోతైన గుంత కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. అంటే ప్రస్తుతం మనుషుల వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి దక్కేది రెండున్నర తులాలు మాత్రమే. కానీ మన కాళ్ల కింద వేల కిలోమీటర్ల లోతులో మాత్రం ప్రతి ఒక్కరినీ కుబేరుడిని చేయగల అంతులేని బంగారు లోకం నిశ్శబ్దంగా నిద్రిస్తూనే ఉంది.

Follow Us