ఆర్థిక భరోసా, భవిష్యత్తు అవసరాలు, కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ వివిధ పాలసీలను తీసుకుంటారు. వాటికి నిబంధనల ప్రకారం వాయిదాలు చెల్లిస్తూ ఉంటారు. కష్టపడే సమయంలో వీటిలో డబ్బులు దాచుకోవడం వల్ల రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబానికి కూడా రక్షణ లభిస్తుంది.
జీవిత బీమా పాలసీలను ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం కొంత కాలం వాయిదాలు కట్టి తర్వాత వదిలేస్తారు. మరి కొందరు వివిధ కారణాల వల్ల కట్టకపోవచ్చు. ఇటువంటి వాటిని ల్యాప్స్‌డ్ పాలసీలు అంటారు. మరి వీటిని ఏం చేయాలి, అలాగే వదిలేయాలా, పునరుద్ధరించుకునే అవకాశముందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో ల్యాప్స్‌డ్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్ఐసీలో ల్యాప్స్‌డ్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం ఉంది. అది మీ పాలసీ డాక్యుమెంట్‌లోని నిర్దిష్ట పాలసీ, నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎల్ఐసీ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా ఉంటుంది. గడువు తేదీలోగా ప్రీమియం చెల్లించనందున మీ పాలసీ ల్యాప్స్ అయిపోతే, దానిని, మీరు పునరుద్ధరించే వరకు పాలసీ ఒప్పందం నిబంధనలు, షరతులు చెల్లవు. ల్యాప్స్‌డ్ అయిన పాలసీని పునరుద్ధరించడానికి ప్రీమియాలను వడ్డీతో సహా చెల్లించాలి. అలాగే అవసరమైతే ఆరోగ్య సంబంధిత ప్రతాలను కూాడా జతచేయాలి.
పాలసీదారుడు మూడేళ్ల పాటు ప్రీమియాలు చెల్లించి ఆపై ఆపివేసినా, అలాగే జీవిత బీమా పొందిన వ్యక్తి మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుంచి ఆరు నెలలలోపు మరణించాడనుకోండి. చెల్లించని ప్రీమియాలను తీసివేసిన తర్వాత మరణించిన తేదీ వరకు వడ్డీతో పూర్తి పాలసీ మొత్తం అందజేస్తారు.
పాలసీదారు కనీసం ఐదేళ్లపాటు ప్రీమియాలు చెల్లించి, ఆపై చెల్లించడం ఆపివేశాడు. అలాగే జీవిత బీమా పొందిన వ్యక్తి మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుంచి 12 నెలలలోపు మరణించాడు. ఆ సమయంలో కూడా చెల్లించని ప్రీమియంలను తీసివేసిన తర్వాత పూర్తి పాలసీ మొత్తం అందజేస్తారు.
ఏడాది, అర్థ సంవత్సరం, త్రైమాసికానికి చెల్లించే పాలసీల ప్రీమియాల కోసం ఒక నెల లేదా కనీసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ అనుమతిస్తారు. నెలవారీ చెల్లింపుల కోసం 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పిరియడ్ లో పాలసీ దారు మరణించినా పూర్తి హామీ మొత్తం చెల్లిస్తారు.
ల్యాప్స్‌డ్ అయిన పాలసీలను ప్లాన్ నిబంధనల ప్రకారం పునరుద్ధరించుకోవచ్చు. దీని కోసం ఎల్‌ఐసీకి రుజువును సమర్పించాలి. అలాగే వడ్డీతో పాటు అన్ని మిగిలిన ప్రీమియాలను చెల్లించాలి. అలాంటి పాలసీ పునరుద్ధరణకు, తిరస్కరించడానికి ఎల్ఐసీకి హక్కు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..