
ధనం మూలం ఇదం జగత్.. అంటే ఈ ప్రపంచానికి, మానవ జీవనానికి ధనమే మూలం అని అర్థం. డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. దానిని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించడంపైనే దృష్టిపెడుతారు. కానీ ఆ డబ్బును ఎలా నిర్వహించాలో తెలీక అనవసర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడం అవసరం. ఆర్థిక నిపుణులు చెప్పే ఈ ఆరు సూత్రాలు జీవితాన్ని మరింత స్థిరంగా మార్చడంలో సహాయపడతాయి.
కేవలం “నాకు చాలా డబ్బు కావాలి” అని కోరుకోవడం వల్ల సంపద రాదు. నైపుణ్యాలు పెంచుకోవడం, కష్టపడి పనిచేయడం, విలువైన సేవలు అందించడం ద్వారా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలే ఆదాయాన్ని పెంచుతాయి. కాబట్టి ముందుగా మీ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి.
అధిక ఆదాయం ఉన్నవారే ధనవంతులు అవుతారని లేదు. ఎంత సంపాదించినా అదుపు లేకుండా ఖర్చు చేస్తే సంపద నిలవదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం, అవసరమైన చోటే పెట్టుబడి పెట్టడం ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం.
డబ్బు జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి ఒక సాధనం మాత్రమే. కానీ డబ్బు కోసం కుటుంబం, ఆరోగ్యం, విలువలను పక్కన పెడితే అది మనల్ని నియంత్రించడం ప్రారంభిస్తుంది. డబ్బును నియంత్రించాలి కానీ డబ్బు మన జీవితాన్ని నియంత్రించనివ్వకూడదు.
అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అనారోగ్యం, ఉద్యోగ మార్పు లేదా ఇతర అవసరాల సమయంలో ముందుగా దాచుకున్న పొదుపే అండగా నిలుస్తుంది. అందుకే ప్రతి నెల ఆదాయంలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.
డబ్బు అవసరం కానీ అదే జీవిత లక్ష్యంగా మారకూడదు. డబ్బు కోసం నిజాయితీ, నమ్మకం, మానవ సంబంధాలు కోల్పోతే సంపద ఉన్నా జీవితంలో సంతృప్తి ఉండదు. మంచి విలువలు, మానవత్వం డబ్బుకంటే గొప్పవని గుర్తుంచుకోవాలి.
మనిషి అవసరాలు, కోరికలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అందుకే డబ్బుతో అన్నింటినీ కొనలేమని అర్థం చేసుకోవాలి. సంపాదనతో పాటు సంతృప్తి, సమతుల్య జీవన విధానం కూడా అలవరుచుకోవాలి.
డబ్బు జీవితంలో అవసరమైనదే కానీ అదే అంతిమ లక్ష్యం కాదు. సంపాదించడం, పొదుపు చేయడం, తెలివిగా ఖర్చు చేయడం, విలువలను కాపాడుకోవడం, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అలవాట్లు ఆర్థిక స్వేచ్ఛకు దారి తీస్తాయి. ఈ ఆరు సూత్రాలను జీవితంలో పాటిస్తే డబ్బు మాత్రమే కాదు..ప్రశాంతమైన జీవితం కూడా మీ సొంతం అమవుతుంది. మరెందుకు ఆలస్యం ఈ అలవాట్లను మొదలుపెట్టేయండి.