GAIL: గ్రీకు కంపెనీతో గెయిల్‌ ఇండియా కీలక ఒప్పందం! ఇక గ్యాస్‌ కొరత ఉండదు?

గెయిల్‌ ఇండియా తన LNG రవాణా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గ్రీకు కంపెనీ ఆల్ఫా గ్యాస్‌తో 'ఎనర్జీ ఫిడిలిటీ' అనే LNG నౌక కోసం దీర్ఘకాలిక చార్టర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అధునాతన నౌక ద్వారా అమెరికా, రష్యా వంటి దేశాల నుండి LNG దిగుమతులు పెరుగుతాయి.

GAIL: గ్రీకు కంపెనీతో గెయిల్‌ ఇండియా కీలక ఒప్పందం! ఇక గ్యాస్‌ కొరత ఉండదు?
Gail India

Updated on: Apr 08, 2026 | 8:02 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా LNG రవాణాను బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. ఎనర్జీ ఫిడిలిటీ అనే LNG రవాణా నౌక కోసం గ్రీకు కంపెనీ అల్ఫా గ్యాస్‌తో దీర్ఘకాలిక చార్టర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఒప్పందం పాంథియోన్ మారిటైం సర్వీసెస్ ద్వారా అమలు చేయబడుతుందని, ఏథెన్స్‌లో ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేసినట్లు వెల్లడించింది. 174,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ ఆధునిక LNG నౌక అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలు, ఇంధన సామర్థ్య సాంకేతికతలతో రూపొందించబడింది. ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో రూపొందించిన ఈ నౌక ద్వారా అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి LNG దిగుమతులను పెంచాలని గెయిల్‌ ఇండియా భావిస్తోంది.

ఈ ఒప్పందం సంస్థ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, దేశానికి స్థిరమైన ఇంధన సరఫరాను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించనుంది. దేశంలోనే అతిపెద్ద సహజ వాయు సంస్థగా ఉన్న గెయిల్‌ ఇండియా ట్రేడింగ్, ట్రాన్స్‌మిషన్, LPG ఉత్పత్తి, LNG షిప్పింగ్, రీ-గ్యాసిఫికేషన్, పెట్రోకెమికల్స్ వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 18,000 కిలోమీటర్లకు పైగా సహజ వాయు పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను సంస్థ నిర్వహిస్తోంది. మరోవైపు ఆల్ఫా గ్యాస్‌ గ్రీక్‌కు చెందిన ప్రముఖ షిప్పింగ్ సంస్థగా LNG నౌకల నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంది.

ఈ ఒప్పందం నేపథ్యంలో మంగళవారం షేర్ మార్కెట్‌లో గెయిల్‌ ఇండియా షేర్లు స్వల్పంగా పెరిగాయి. బీఎస్ఈలో ఈ షేర్ 1.47 శాతం లాభంతో రూ.145.25 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో రూ.145.75 గరిష్ట స్థాయిని తాకగా, రూ.141.05 కనిష్ట స్థాయికి చేరింది. గతంలో 2025 జూన్‌లో రూ.202.65 గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్, 2026 మార్చిలో రూ.134.35 వరకు పడిపోయింది. మొత్తంగా ఈ ఒప్పందం ద్వారా గెయిల్‌ ఇండియా తన LNG రవాణా సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు, దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us