Fast Food Business: ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు.. ఆదాయం వెనుకున్న నిజాలు ఏంటో తెలుసా?
Fast Food Business Profits: ఒక ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ చెప్పిన కొలతల ప్రకారం, ఒక ప్లేట్ చికెన్ నూడుల్స్ తయారీకి రూ.42 నుండి రూ.52 ఖర్చవుతుంది. ఇందులో పచ్చి నూడుల్స్ (ఒక ప్లేట్‌కి రూ.8.50), నూనె (రూ.7), ఒక గుడ్డు (రూ.7) ప్రధాన..

Fast Food Business Profits: సోషల్ మీడియాలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నెలకు రూ.3 లక్షల ఆదాయం సంపాదిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, హైదరాబాద్‌లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు చెప్పేదేమిటంటే ఈ రూ.3 లక్షలు నెలవారీ మొత్తం అమ్మకాలు (కౌంటర్) మాత్రమేనని, ఖర్చులన్నీ పోను అసలు ఆదాయం చాలా తక్కువని వెల్లడైంది. ఒక యజమాని ప్రకారం, నెలకి సగటున రూ.30,000 మాత్రమే మిగులుతుంది. ఇదే సమయంలో నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆహార భద్రతా తనిఖీలు పెరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా మళ్ళీ వాడిన నూనె, రంగు వేసిన చికెన్‌ను వినియోగిస్తున్న కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్ట్ ఫుడ్ వ్యాపారంలో నిజంగా ఎంత మిగులుతుందో తెలుసుకుందాం..
ఒక ప్లేట్ చికెన్ నూడుల్స్ తయారీ ఖర్చు:
ఒక ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ చెప్పిన కొలతల ప్రకారం, ఒక ప్లేట్ చికెన్ నూడుల్స్ తయారీకి రూ.42 నుండి రూ.52 ఖర్చవుతుంది. ఇందులో పచ్చి నూడుల్స్ (ఒక ప్లేట్‌కి రూ.8.50), నూనె (రూ.7), ఒక గుడ్డు (రూ.7) ప్రధాన ఖర్చులు. చికెన్, క్యాబేజీ, క్యారెట్, సాస్ లు, గ్యాస్, పార్సిల్ కవర్ వంటి ఇతరత్రా ఖర్చులకు అదనంగా రూ.20 నుండి రూ.30 అవుతుంది. హైదరాబాద్‌లో Swiggyలో చూసిన 45 రెస్టారెంట్లలో చికెన్ ఫ్రైడ్ రైస్ సగటు ధర రూ.239గా ఉంటుంది. అయితే ఫాస్ట్ ఫుడ్ పేరున్న షాపుల్లో రూ.145 నుండి రూ.200 వరకు ఉంది.
రూ.100 అమ్మకంలో లాభం ఎంత?
కస్టమర్ రూ.100 చెల్లిస్తే, ఒక మాస్టర్‌ని, హెల్పర్‌ని పెట్టుకున్న షాపు యజమానికి రూ.10 మాత్రమే మిగులుతుంది. జీతాలకు రూ.17 పోగా, మిగిలిన రూ.73 సరుకులు, గ్యాస్, అద్దె, కరెంట్, పార్సిల్ కవర్లు, అమ్ముడుపోక మిగిలిపోయే సరుకు వంటి వాటికి ఖర్చవుతుంది. నెలవారీ రూ.3 లక్షల కౌంటర్ నడిపినా, యజమానికి రూ.30,000 మాత్రమే మిగులుతుంది. ఇది రోజుకు రూ.1,000తో సమానం. అయితే, ఈ రూ.30,000 కూడా స్థిరంగా ఉండదు. కొన్ని రోజులు వ్యాపారం తక్కువగా ఉండవచ్చు.
మాస్టర్ vs ఓనర్ vs బండి యజమాని:
ఆశ్చర్యకరంగా మాస్టర్‌ని పెట్టుకున్న షాపు యజమానికి ఎంతైతే మిగులుతుందో, కడాయి పట్టుకునే మాస్టర్‌కి కూడా దాదాపు అంతే జీతం లభిస్తుంది. మాస్టర్‌కి రోజుకు రూ.1,000-రూ.1,100, అంటే నెలకు రూ.30,000 పైనే. యజమాని రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి రూ.30,000 సంపాదిస్తుంటే, మాస్టర్ పెట్టుబడి లేకుండా అంతే సంపాదిస్తున్నాడు. మాస్టర్ మారితే రుచి మారి కస్టమర్లు దూరమవుతారనేది యజమానుల ప్రధాన టెన్షన్.
కుటుంబంతో నడిపే షాపుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మాస్టర్‌ని పెట్టుకోకుండా కుటుంబ సభ్యులే వంట, సర్వీస్ చేస్తే, నెలకు రూ.70,000 నుండి రూ.90,000 వరకు మిగులుతుంది. బయటి వారికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం దీనికి కారణం. అంటే ముగ్గురు కుటుంబ సభ్యులు పనిచేస్తే ఒక్కొక్కరికి రోజుకు రూ.1,000 చొప్పున ఆదాయం వస్తుంది.
గుంటూరులో 8 ఏళ్లుగా నూడుల్స్ బండి నడుపుతున్న ఒక యజమాని కథ కూడా ఇదే. ఆయనే యజమాని, ఆయనే మాస్టర్. రోజుకు రూ.1,000 నుండి రూ.1,500 వరకు సరుకు ఖర్చు పోగా, రోజుకు రూ.1,000 మిగులుతుందని ఆయన తెలిపారు.
పెట్టుబడి, షార్ట్‌కట్‌లు, తనిఖీలు:
అయితే సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియోలో రూ.50,000 పెట్టుబడి అని ఉన్నా, వాస్తవానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కి కనీసం రూ.2 లక్షల నుండి ₹8 లక్షల వరకు పెట్టుబడి అవసరమని యజమానులు చెబుతున్నారు. కొత్తగా షాపు పెట్టిన వారికి మొదటి కొన్ని నెలలు నష్టాలు కూడా రావచ్చని సంగారెడ్డిలోని ఒక ఫుడ్ ట్రక్ యజమాని అనుభవం ద్వారా తెలుస్తుంది.
రూ.100లో రూ.10 మాత్రమే మిగిలే చోట, యజమానులు ఖర్చులను తగ్గించుకోవడానికి కొన్ని షార్ట్‌కట్‌లు (నూనె, పిండి, రంగులు) ఉపయోగిస్తారు. మళ్ళీ వాడిన నూనె, పిండి అధికంగా వాడటం, సింథెటిక్ రంగులు కలపడం వంటివి ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధం. ఇటీవల హైదరాబాద్‌లో H-FAST, TG SAFE తనిఖీల్లో ఇలాంటి ఉల్లంఘనలు బయటపడి, పలు షాపుల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి.
ఈ వ్యాపారంలోకి దిగాలనుకునే వారికి ముఖ్యమైన పాఠాలు: వంట మీకే వస్తే ఈ వ్యాపారం లాభదాయకం. లేదంటే మీ వ్యాపారం మాస్టర్ చేతిలో ఉంటుంది. మొదట ఏదైనా నూడుల్స్ బండి దగ్గర 6 నెలలు పనిచేసి, ఆపై బండితో ప్రారంభించడం మంచిది. బండికి చోటు రిస్క్ ఉన్నా, తక్కువ పెట్టుబడితో రోజుకు రూ.1,000 సంపాదించవచ్చు. రూ.3 లక్షల షాపులో కూడా అదే రూ.1,000 వస్తుంటే, బండి లాభదాయకంగా కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిలబడితే నెలకి రూ.70,000-రూ.90,000 వరకు సంపాదించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
