ETFలు vs మ్యూచువల్ ఫండ్లు.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? నిపుణుల సూచన ఇదే!
నేడు పెట్టుబడి ప్రపంచంలో ETFలు, మ్యూచువల్ ఫండ్‌లు ప్రధాన ఎంపికలు. రెండూ డబ్బును సమీకరించి మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినా, ట్రేడింగ్ విధానం, ఖర్చులు, నిర్వహణలో విభిన్నంగా ఉంటాయి. ETFలు తక్కువ ఖర్చుతో మార్కెట్ సూచికను అనుసరిస్తే, మ్యూచువల్ ఫండ్‌లు వృత్తిపరమైన నిర్వహణ, SIP సౌలభ్యాన్ని అందిస్తాయి.

పెట్టుబడి పెట్టాలి అనుకునే వారిలో చాలా మందికి వచ్చే డౌట్ ETFలు (Exchange-Traded Funds), మ్యూచువల్ ఫండ్లు రెండింటిలో ఎందులో పెట్టాలి అని. అయితే ఈ రెండింటి లక్ష్యం ఒకటే.. పెట్టుబడిదారుల డబ్బును సమీకరించి స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆస్తుల్లో పెట్టి దీర్ఘకాలంలో సంపద సృష్టించడం. అయితే పెట్టుబడి విధానం, సౌలభ్యం, ఖర్చుల విషయంలో ఈ రెండింటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి. ETFలను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో షేర్లలా కొనుగోలు-అమ్మకాలు చేస్తారు. వీటికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తప్పనిసరి. మార్కెట్ సమయాల్లో ఎప్పుడైనా కొనుగోలు లేదా విక్రయం చేయవచ్చు. ధరలు రోజంతా మారుతుంటాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు నేరుగా ఫండ్ హౌస్ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇవి రోజుకు ఒకసారి, మార్కెట్ ముగిసిన తర్వాత ప్రకటించే NAV వద్దనే లావాదేవీలు జరుగుతాయి. దీంతో తక్షణ ట్రేడింగ్ అవకాశాలు తగ్గినా, తొందరపాటు నిర్ణయాలు తగ్గే ప్రయోజనం ఉంటుంది.
ETFలు సాధారణంగా నిఫ్టీ 50 వంటి సూచికను అనుసరించే నిష్క్రియాత్మక (Passive) పెట్టుబడులు. అంటే సూచికలో ఉన్న స్టాక్‌లను అదే నిష్పత్తిలో కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లలో అయితే చాలా ఫండ్లు చురుకుగా (Active) నిర్వహించబడతాయి. ఫండ్ మేనేజర్లు తమ విశ్లేషణ ఆధారంగా స్టాక్‌లను ఎంపిక చేస్తారు. ఎంపిక సరిగ్గా ఉంటే సూచిక కంటే మెరుగైన రాబడులు సాధ్యమే కానీ రిస్క్ కూడా ఉంటుంది.
SIP సౌలభ్యం
ఇండియాలో SIP (Systematic Investment Plan) వల్ల మ్యూచువల్ ఫండ్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. ప్రతి నెలా ఆటోమేటిక్‌గా స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టే సౌకర్యం ఉంటుంది. ETFల్లో ఈ ఆటోమేషన్ సాధారణంగా ఉండదు. అందుకే క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్లు మరింత సులభంగా ఉంటాయి. ETFలు సాధారణంగా తక్కువ ఖర్చు నిష్పత్తి కలిగి ఉంటాయి, దీర్ఘకాలంలో ఇది లాభదాయకం. అయితే బ్రోకరేజ్ ఛార్జీలు, బిడ్-ఆస్క్ స్ప్రెడ్ వంటి దాచిన ఖర్చులు ఉండొచ్చు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లు కొంచెం ఖరీదైనవైనా, మంచి ఫండ్ మేనేజ్‌మెంట్ ద్వారా అధిక రాబడి అవకాశం ఉంటుంది.
తక్కువ ఖర్చు, మార్కెట్‌ను అనుసరించే రాబడి కావాలంటే ETFలు, సులభమైన SIP పెట్టుబడి, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ కావాలంటే మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడతున్నారు. మొత్తానికి ఉత్తమ ఎంపిక మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ స్వభావం, పెట్టుబడి క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
