AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాన్ మస్క్‌కు విచిత్ర అలవాట్లు.. వీటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Elon Musk Lifestyle: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థలతో నిత్యం బిజీగా ఉండే ఆయనకు కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి. ఖాళీ సమయం దొరికితే వీడియో గేమ్స్ ఆడటం, రోజుకు ఆరు గంటలే నిద్రపోవడం, అప్పుడప్పుడు ఆఫీసులోనే నిద్రించడం.. ఇలా ఆయన జీవనశైలి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మస్క్‌కు ఉన్న ఆ వింత అలవాట్లు ఏంటి? ఆయన రోజువారీ జీవితం ఎలా సాగుతుంది? తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్‌కు విచిత్ర అలవాట్లు.. వీటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Elon Musk Lifestyle
Krishna S
|

Updated on: Nov 10, 2026 | 3:30 PM

Share

ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థలతో ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను కలిగి ఉన్నారు. పని విషయంలో ఎంత బిజీగా ఉంటారో.. ఖాళీ సమయంలోనూ అంతే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. నిద్రపోయే సమయం నుంచి ఆహారం తీసుకునే విధానం వరకు ఆయన జీవనశైలి కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా వీడియో గేమ్స్ ఆడటం, అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండటం, అప్పుడప్పుడు కార్యాలయంలోనే నిద్రించడం వంటి అలవాట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంతకీ ఎలాన్ మస్క్‌కు ఉన్న ఆ ప్రత్యేకమైన అలవాట్లేంటో తెలుసుకుందాం.

వీడియో గేమ్స్ అంటే ఎంతో ఇష్టం..

ఎలాన్ మస్క్‌కు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. సాధారణంగా చాలామంది ఖాళీ సమయాన్ని సినిమాలు చూడటం, సంగీతం వినడం లేదా ఇతర వ్యాపకాలతో గడుపుతుంటారు. కానీ మస్క్ మాత్రం వీడియో గేమ్స్ ఆడటాన్ని తన ప్రధాన వినోద కార్యకలాపంగా భావిస్తారు. 2025 జనవరిలో ఎక్స్‌లో చేసిన ఓ పోస్టులో.. వీడియో గేమ్స్ ఆడటం తన మనసును ప్రశాంతంగా ఉంచే ఏకైక వినోదమని వెల్లడించారు. కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచినప్పుడు గేమ్స్ ఆడటం తనకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి గేమ్స్ అంటే వినోదం కాగా.. మస్క్‌కు మాత్రం అది ఒత్తిడి నుంచి బయటపడే మార్గాల్లో ఒకటి.

రోజుకు ఆరు గంటల నిద్ర..

ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిద్ర విషయంలో మస్క్ కొన్ని పరిమితులను పాటిస్తారు. 2025 డిసెంబర్‌లో కేటీ మిల్లర్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తాను సాధారణంగా రోజుకు ఆరు గంటలు నిద్రపోతానని చెప్పారు. అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే ఎక్కువ గంటలు మెలకువగా ఉండగలిగినా.. ఆలోచనా సామర్థ్యం తగ్గుతుందని వివరించారు. తన ఫోన్‌లోని నిద్ర ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా నిద్ర సమయాన్ని పరిశీలించుకున్నట్లు చెప్పారు. తనకు సహజంగా దాదాపు ఐదు గంటల 56 నిమిషాల నిద్ర అవసరమని ఆ యాప్ చూపించినట్లు వెల్లడించారు.

అర్ధరాత్రి సోషల్ మీడియాలో యాక్టివ్..

ఎలాన్ మస్క్ సోషల్ మీడియా పోస్టులు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. ముఖ్యంగా ఎక్స్‌లో ఆయన చేసే పోస్టులు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తాయి. అయితే అర్ధరాత్రి తర్వాత చేసే పోస్టుల విషయంలో ఆయనకే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. 2023లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తెల్లవారుజామున 3 గంటల తర్వాత ట్వీట్లు చేయకూడదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న పోస్టులను వెంటనే ప్రచురించకుండా డ్రాఫ్ట్‌లో ఉంచి, మరుసటి రోజు చూసుకున్నాక నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఆఫీసులోనే నిద్రపోయే అలవాటు..

పని మీద ఎక్కువ సమయం కేటాయించే మస్క్‌కు కార్యాలయంలోనే నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. 2023లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని అప్పటి ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో అప్పుడప్పుడు నిద్రపోయేవాడినని చెప్పారు. అక్కడ ఏడో అంతస్తులో ఎవరూ పెద్దగా ఉపయోగించని లైబ్రరీలో సోఫాపై పడుకునేవాడినని వెల్లడించారు. అంతకుముందు టెస్లా కార్యాలయంలోనూ నిద్రించిన సందర్భాలున్నాయి. 2018లో సీబీఎస్‌కు తన కార్యాలయంలోని నిద్రించే ప్రదేశాన్ని కూడా చూపించారు. అయితే ఇది ఆయన ఎప్పుడూ పాటించే రోజువారీ అలవాటు కాదు.. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో చేసిన పని.

బ్రేక్‌ఫాస్ట్‌లో స్టీక్, ఎగ్స్.. లంచ్ మాత్రం చాలా తక్కువ..

ఆహారం విషయంలోనూ మస్క్‌కు కొన్ని ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. 2025 డిసెంబర్‌లో కేటీ మిల్లర్ పోడ్‌కాస్ట్‌లో తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. ఉదయం స్టీక్, ఎగ్స్, కాఫీతో అల్పాహారం తీసుకుంటానని చెప్పారు. సాధారణంగా మధ్యాహ్న భోజనం చేయనని, ఒకవేళ చేసినా చాలా తక్కువగా తీసుకుంటానని వెల్లడించారు. ఇక రాత్రి భోజనం మాత్రం సందర్భాన్ని బట్టి మారుతుందని తెలిపారు. తనకు అమెరికన్ ఫుడ్ అంటే ఇష్టమని, జీవితాంతం ఒకే ఆహారం తినాల్సి వస్తే చీజ్‌బర్గర్‌ను ఎంచుకుంటానని సరదాగా చెప్పారు.

ఒకేసారి చాలా పనులు చేయడం ఇష్టం ఉండదా?

ప్రపంచంలోని పలు కీలక సంస్థల బాధ్యతలు నిర్వహించే మస్క్‌కు రోజూ పెద్ద సంఖ్యలో సమాచారం, సందేశాలు వస్తుంటాయి. అయితే ప్రతి పనిని ఒకేసారి చేయడం కంటే.. రోజును విభిన్న పనులకు అనుగుణంగా విభజించుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఒక పని నుంచి మరో పనికి తరచూ మారడం వల్ల ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే వీలైనంత వరకు ఒకే సమయంలో ఒక అంశంపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తానని వివరించారు.

ఇలా తనకంటూ ప్రత్యేకమైన జీవనశైలి..

చూస్తుంటే ఎలన్ మస్క్ వ్యక్తిగత అలవాట్లు కూడా ఆయనలాగే కొంత భిన్నంగా కనిపిస్తాయి. వీడియో గేమ్స్‌తో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, నిద్ర విషయంలో తనకు అవసరమైన సమయాన్ని గుర్తించడం, ఆహారంలో ప్రత్యేకమైన ఎంపికలు చేసుకోవడం, పని ఒత్తిడి ఉన్నప్పుడు కార్యాలయంలోనే నిద్రించడం.. ఇలా ఆయన జీవనశైలిలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆయన వివిధ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల్లో స్వయంగా వెల్లడించిన విషయాల ఆధారంగా తెలుసుకున్నవే.

Follow Us