అత్తమామల ఆస్తిలో కోడలికి హక్కు ఉంటుందా..? ఈ సమయంలో వచ్చే ఛాన్స్.. రూల్స్ ఇవే..
అత్తమామల ఆస్తిలో కోడలికి వాటా ఉంటుందా..? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం కోడలికి కొన్ని సమయాల్లో భర్త ఆస్తిలో వాటా లభిస్తుంది. అలాగే ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు ఉంటుంది. కోడలికి ఎలాంటి ఆస్తి హక్కులు ఉంటాయో తెలుసుకుందాం.

భారతదేశంలో ఆస్తి హక్కులు మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి మరో వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి రూల్స్ మారుతుంటాయి. ఆస్తి పొందటానికి సంబంధించి కుమారుడు, కూతురు, భార్య, కోడళ్లకు వేర్వురు నిబంధనలు ఉంటాయి. ఇక వారసత్వం, స్వయంగా సంపాదించిన ఆస్తిని బట్టి కూడా నిబంధనల్లో మార్పులు ఉంటాయి. ఇక కోడలికి అత్తమామల ఆస్తిలో వాటా ఉంటుందా..? ఆమెకు ఎలాంటి హక్కులు ఉంటాయి? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో అత్తమామల ఆస్తి నుంచి కోడలు వాటా కోరవచ్చు. చట్టప్రకారం కూడా ఆమెకు ఆస్తి రావచ్చు. ఏయే పరిస్థితుల్లో హక్కు లభిస్తుందనేది చూద్దాం.
కోడలికి ఎప్పుడు హక్కు ఉంటుంది..?
అత్తమామల ఆస్తి నుంచి ఆటోమేటిక్‌గా కోడలికి హక్కులు లభించవు. భర్త నుంచి మాత్రమే ఆస్తి లభించే అవకాశం ఉంటుంది. భర్తకు ఉన్న ఆస్తిలో భార్యకు వాటా దానంతట అదే లభించదు. భర్త జీవించి ఉంటే భార్యకు అతడి ఆస్తిలో వాటా దక్కదు. ఒకవేళ భర్త చనిపోయి ఉంటే అతని ఆస్తిలో భార్యకు వాటా వస్తుంది. భర్త చనిపోయిన సందర్భంలో వారసత్వ నియమాల ప్రకారం భార్యకు ఆస్తులు లభిస్తాయి. అయితే ఇది వారసత్వ చట్టం, ఆస్తి స్వభావం, వీలునామా వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం భర్త వీలునామా రాయకుండా మరణించినప్పుడు అతడి ఆస్తి పొందేందుకు భార్య మొదటి తరగతి వారసులు అవుతుంది. అతడి పిల్లలు, తల్లితో పాటు భార్యకు కూడా వాటా లభిస్తుంది. కేవలం భర్త యాజమాన్యంలో ఉన్న ఆస్తిపై మాత్రమే భార్యకు హక్కులు ఉంటాయి. అత్తమామల పేరుపై ఉన్న ఆస్తిలో కోడలకు హక్కులు ఉండవు.
భరణం కోరవచ్చా..?
ఇక భర్తకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో భార్యకు వాటా దానంతట అదే లభించదని గుర్తించుకోవాలి. వారసత్వం, ఇతర నిబంధనలు బట్టి భర్త ఆస్తి భార్య పొందవచ్చు. అయితే కోడలికి ఇంట్లో నివసించే హక్కు ఉంటుంది. ఇల్లు తాను సొంతం చేసుకోకపోయినా.. ఉమ్మడి గృహంలో నివసించే హక్కు ఉంటుంది. భర్త ఆస్తితో సంబంధం లేకుండా ఇంట్లో నివసించే హక్కు ఉంటుంది. ఇక తనను తాను పోషించుకోలేని సమయంలో హిందూ దత్తత, భరణ చట్టం, 1956 ప్రకారం నివాసంతో పాటు భరణం పొందేందుకు కోడలికి హక్కు ఉంటుందని చెప్పవచ్చు.
