Indian Railways: రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు మద్యం తీసుకెళ్లవచ్చా..? నిబంధనలు ఇవే.. ఈ పరిమితి వరకు..
దేశంలో రైళ్లల్లో తరచూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. దేశ నలుమూలకు రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. అయితే రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమ వెంట లగేజీ తీసుకెళ్తుంటారు. అయితే మద్యం కూడా తీసుకెళ్లవచ్చా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. నిబంధనలు చూస్తే..

రైళ్లల్లో మద్యం తీసుకెళ్లవచ్చా.. ? లేదా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. చాలామంది అనుమానం రాకుండా రైళ్లల్లో మద్యం తీసుకెళ్తూ ఉంటారు. స్టేషన్ సిబ్బంది లేదా పోలీసులు పట్టుకుంటే ఇబ్బంది అవుతుందని భావిస్తుంటారు. సీల్ చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లవచ్చనే భావన చాలామందిలో ఉంటుంది. మద్యం తీసుకెళ్లడానికి అనుమతించేందుకు దేశవ్యాప్తంగా ఎలాంటి నియమాలు లేవు. రాష్ట్రాలను బట్టి రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు కొంత పరిమాణంలో అనుమతిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాలను బట్టి రూల్స్ మారుతూ ఉంటాయి. ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం వ్యక్తిగత వినియోగం కోసం కొంత పరిమాణంలో మద్యం తీసుకెళ్లవచ్చు.
ఎంతవరకు తీసుకెళ్లవచ్చంటే..?
ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1983 ప్రకారం రైళ్లల్లో మద్యం తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం విధించలేదు. ఈ బాధ్యత పూర్తిగా రాష్ట్రాలకు వదిలేసింది. మద్యంపై నిషేధం అమల్లో లేని రాష్ట్రాల గుండా వెళ్తుంటే ట్రైన్లలో తీసుకెళ్లవచ్చు. మద్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రాల గుండా వెళ్తుంటే.. మీరు ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు. బీహార్, గుజరాత్,నాగాలాండ్, లక్షద్వీప్ లాంటి రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. మీరు ప్రయాణించే రైలు ఈ రాష్ట్రాల గుండా వెళుతుంటే తీసుకెళ్లడానికి నిబంధనలు అంగీకరించవు. ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాల ప్రకారం మీరు చిక్కుల్లో పడవచ్చు. ఇక అనుమతి ఉన్న రాష్ట్రాల గుండా వెళ్తుంటే సీలు చేసిన మద్యంను వ్యక్తిగత వినియోగం కోసం తీసుకెళ్లవచ్చు. రెండు లీటర్ల వరకు మద్యం మాత్రమే రైళ్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అది కూడా బాటిల్స్ అన్నీ సీల్ ప్యాక్ చేసి ఉండాలి. ఇక ఖాళీ బాటిల్స్‌ను తీసుకెళ్లడానికి నిబంధనలు అంగీకరించవు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ.10 వేల వరకు జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష ఉంటుంది. కొన్నిసార్లు రెండూ విధించవచ్చు. ఏ రాష్ట్రంలో పట్టుబడితే ఆయా రాష్ట్రాల చట్టాల ప్రకారం అరెస్ట్, జరిమానా, జైలుశిక్ష లాంటివి ఉంటాయి.
ఒకసారి వీటిని పరిశీలించుకోండి..
మీరు రైల్లో మద్యం తీసుకెళ్లాలని అనుకుంటే.. మీ ట్రైన్ ఏయే రాష్ట్రాల గుండా వెళుతుందనేది తెలుసుకోండి. ఆయా రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉందా.. లేదా అనే వివరాలు తెలుసుకోండి. నిషేధం లేకపోతే పరిమితి వరకు తీసుకెళ్లవచ్చు. నిషేధం ఉంటే మాత్రమే మీరు తీసుకెళితే ఇబ్బందుల్లో పడతారు. అధికారులకు పట్టుబడితే మీరు జరిమానాతో పాటు కేసులను ఎదుర్కొంటారు. ఇక రైల్వే స్టేషన్లు, రైళ్లల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
