
సొంత ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి కల. జీవితకాలం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఇందుకోసం ఇంటి ధర, విస్తీర్ణం, నిర్మాణ నాణ్యత, ఇంటీరియర్స్ వంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే ఇల్లు కొనేటప్పుడు వీటితో పాటు ఆ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా తప్పనిసరిగా గమనించాలి. ఎందుకంటే మంచి ఫ్లాట్ అయినప్పటికీ, అది ఉన్న ప్రాంతం సరిగ్గా లేకపోతే రోజువారీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని భారతీయ రియల్టర్ లోకేష్ ఖండేల్వాల్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వివరించారు. ఆయన నిర్వహిస్తున్న ‘ది ప్రాపర్టీ జ్ఞాన్’ ఖాతాలో ఇంటి కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాల్సిన ఐదు ప్రాంతాలను వెల్లడించారు. ఈ ఐదు ప్రదేశాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే ప్రశాంతమైన జీవితం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు.
రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు కొనుగోలు చేయడం వల్ల నిత్యం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రైళ్లు వెళ్లే సమయంలో వచ్చే భారీ శబ్దాలు మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున రైళ్ల రాకపోకల వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో రైళ్లు వెళ్లే సమయంలో ఇంట్లో ప్రకంపనలు కూడా వస్తూ అసౌకర్యానికి గురిచేస్తుంది. అందుకే ఇంటిని కొనుగోలు చేసే ముందు..ఈ అంశాన్ని పరిశీలించడం మంచిది.
చెత్తను సేకరించే డంపింగ్ యార్డులకు సమీపంలో ఇల్లు కొనడం కూడా మంచిది కాదు. అక్కడ పేరుకుపోయే చెత్తాచెదారాల నుంచి వెలువడే దుర్వాసన ఇంట్లో నివసించే వారిని ఇబ్బంది పెడుతుంది. చెత్త, వ్యర్థాల కారణంగా అక్కడ దోమలు, ఈగలు వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇది అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అందుకే మరీ ముఖ్యంగా పిల్లలు, పెద్దలు నివసించే కుటుంబాలు ఇలాంటి ప్రాంతాల్లో ఇల్లు కొనేముందు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాలి.
ఇంటి పక్కనే మ్యారేజ్ గార్డెన్ లేదా ఫంక్షన్ హాల్ ఉంటే కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగినప్పుడు భారీ శబ్దాలతో సంగీతం, డీజేలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ శబ్దాల వల్ల స్థానిక నివాసితులకు నిద్రకు భంగం కలిగే అవకాశముంది. తరచూ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో నివసించడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఆ ప్రాంతంలో ఫంక్షన్లు ఎంత తరచుగా జరుగుతాయో తెలుసుకోవాలి.
ఓపెన్ డ్రైనేజీలు, మురికి కాలువల పక్కన ఇల్లు కొనుగోలు చేయడం కూడా సమస్యలకు దారితీసే అవకాశముంది. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు కాలువల పక్కనే లేదా వాటిపై నిర్మిస్తున్నారని రియల్టర్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతాయి. దోమల కారణంగా అనారోగ్య సమస్యలకు అవకాశముంది. వర్షాకాలంలో మురుగు నీరు పొంగిపొర్లడం, నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. అందువల్ల ఇంటిని కొనుగోలు చేసే ముందు సమీపంలోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాలి.
హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సమీపంలో ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ తీగలు, భవనాల మధ్య తగినంత దూరం ఉండటం చాలా ముఖ్యం. విద్యుత్ లైన్ల వోల్టేజ్‌ను బట్టి భవనాలకు ఉండాల్సిన కనీస దూరంపై నిబంధనలు ఉన్నాయి. కాబట్టి కొనుగోలుదారులు సంబంధిత అధికారుల నిబంధనలను పరిశీలించాలి. విద్యుత్ తీగలకు సంబంధించిన భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
ఇల్లు కొనకూడదని 5 ప్రాంతాలు ఇవే..
ఈ ఐదు ప్రాంతాలతో పాటు శ్మశాన వాటికలు, నీరు నిలిచిపోయే ప్రాంతాలకు సమీపంలో ఇల్లు కొనుగోలు చేసే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కొందరు నెటిజన్లు సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆ ప్రాంతాన్ని సందర్శించి నీరు నిలిచే సమస్య ఉందో లేదో తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇల్లు కొనుగోలు చేసే ముందు ఒకసారి మాత్రమే మొక్కుబడిగా వెళ్లి రావడం సరిపోదు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లోనూ ఆ ప్రాంతాన్ని పరిశీలించాలి. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకోవాలి. వీలైతే వర్షం పడిన సమయంలోనూ ఆ ప్రాంతాన్ని సందర్శించాలి.