ఒక్క రీఛార్జ్‌తో రూ.లక్ష ఇన్సూరెన్స్.. BSNL బంపర్ ఆఫర్..

బీఎస్ఎన్ఎల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు కొత్త ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. STV 202, STV 2449 ప్లాన్లతో అదనపు ప్రీమియం లేకుండా రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా, అర్హత కలిగిన సైబర్‌ మోసాల నష్టాలకు రూ.10 వేల వరకు కవరేజీ లభించనున్నట్లు తెలిపింది. ఈ బీమా సదుపాయం ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నిబంధనలకు లోబడి ఉంటుంది.

ఒక్క రీఛార్జ్‌తో రూ.లక్ష ఇన్సూరెన్స్.. BSNL బంపర్ ఆఫర్..
Bsnl Recharge Plans

Updated on: Oct 02, 2026 | 1:17 PM

భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బిఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక వినూత్నమైన, అత్యంత ప్రయోజనకరమైన ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో డిజిటల్ వినియోగం శరవేగంగా పెరుగుతున్న తరుణంలో, కేవలం కాలింగ్, డేటా సేవలకు మాత్రమే పరిమితం కాకుండా వినియోగదారుల భద్రతకు కూడా ప్రాధాన్యతనిస్తూ రీఛార్జ్ ప్లాన్‌లలో ఉచితంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా (Accidental Insurance), సైబర్ ప్రొటెక్షన్ (Cyber Protection) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికోసం.. STV 202, STV 2449 ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే.. అర్హులైన చందాదారులకు దీనికి అదనపు ఖర్చు ఏమీ ఉండదు. వీటికి రూ.1 లక్ష ప్రమాద బీమా కవరేజీ, రూ.10,000 సైబర్ మోసాల కవరేజీ రెండూ ఉంటాయి. ఈ బీమా కవరేజీని అందించడానికి BSNL, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (OICL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇన్సూరెన్స్‌తో కూడిన BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇలా..

STV 202 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 300 నిమిషాల వాయిస్ కాల్స్, 5GB హై-స్పీడ్ డేటా, 100 SMSల సౌకర్యం లభిస్తుంది.

STV 2449 ప్లాన్ : ఈ ప్లాన్‌కు 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఏడాది పాటు రీచార్జ్ టెన్షన్ ఉండకూడనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్..

ఎంపిక చేసిన బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే ఖాతాదారులకు ఎలాంటి అదనపు ప్రీమియం లేదా రుసుము లేకుండా రూ. 1 లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా.. సైబర్-ఫ్రాడ్ విభాగం అర్హత కలిగిన సైబర్-ఫ్రాడ్ నష్టాలకు రూ. 10,000 వరకు కవరేజీని అందిస్తుంది. సాధారణంగా లభించే అపరిమిత ఉచిత కాలింగ్ (Unlimited Calling), ప్రతిరోజూ హై-స్పీడ్ డేటా, ఎస్‌ఎమ్‌ఎస్‌‌ (SMS) సౌకర్యాలు ఈ ప్లాన్‌లలో యథావిధిగా కొనసాగుతాయి.

BSNL బీమా ప్రయోజనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న ఇన్సూరెన్స్-లింక్డ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అర్హత గల రీఛార్జ్ చేసిన వెంటనే, ఇన్సూరెన్స్ పాలసీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. పాలసీ వివరాలు సబ్‌స్క్రైబర్‌కు SMS ద్వారా పంపబడతాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, అర్హత గల రీఛార్జ్ జరిగిన 24 గంటల తర్వాత భీమా కవరేజ్ యాక్టివ్ అవుతుంది.

వినియోగదారులు ప్రత్యేక బీమా పాలసీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లకు బీమా రక్షణను జోడించేందుకు ఈ ఆఫర్ రూపొందించారు.. అయితే, ఈ కవరేజ్ ‘ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ’ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ..

వాస్తవానికి ఇటీవలి కాలంలో ప్రైవేట్ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్, విఐ తమ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఈ సమయంలో రూ. 1 లక్ష బీమా, సైబర్ సెక్యూరిటీ వంటి అదనపు ప్రయోజనాలను అందించడం ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.

సాధారణ పౌరులకు ఆర్థిక, డిజిటల్ రక్షణ: గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతోనే కనెక్టివిటీతో పాటు ఆర్థిక, డిజిటల్ భద్రతను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

తక్కువ ధరలో మెరుగైన ప్లాన్‌లతో పాటు, ప్రాణానికి బీమా, డిజిటల్ లైఫ్‌కు సైబర్ ప్రొటెక్షన్ ఒకే రీఛార్జ్‌లో లభిస్తుండటంతో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన ఈ నిర్ణయంపై టెలికాం వర్గాల్లో, వినియోగదారులలో విశేష స్పందన వ్యక్తమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us