AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేల మందిని గొర్రెలను చేసి ఒక్క రాత్రిలో 8.5 కోట్లు సంపాదించాడు! ఇందులో నిజమెంతా?

ఆగస్టు 25 రివీల్‌ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. మాస్క్‌ ధరించిన అనామక ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్‌ కౌంట్‌డౌన్‌ ద్వారా భారీ హైప్‌ సృష్టించాడు. టెలిగ్రామ్‌లో 250 స్టార్స్‌ చెల్లించిన వారికి రివీల్‌ వీడియో చూపించారు. చివరకు సాధారణ మోటివేషనల్‌ వీడియో రావడంతో స్కామ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి.

వేల మందిని గొర్రెలను చేసి ఒక్క రాత్రిలో 8.5 కోట్లు సంపాదించాడు! ఇందులో నిజమెంతా?
August 25 Reveal Controversy
SN Pasha
|

Updated on: Aug 28, 2026 | 10:49 AM

Share

సోషల్‌ మీడియాలో August 25 Reveal పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పేరు బాగా వైరల్ అవుతోంది. మాస్క్‌ ధరించిన ఓ అనామక ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్‌ రోజుకో కౌంట్‌డౌన్‌ వీడియోతో భారీ అంచనాలు పెంచాడు. ఆగస్టు 25 రాత్రి ఏదో సంచలన విషయాన్ని బయటపెడతానంటూ చేసిన ప్రచారం కారణంగా ఆ అకౌంట్‌కు 4 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరారు. రివీల్‌ సమయం దగ్గరపడే కొద్దీ ఫాలోవర్లలో ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరిగింది. కీలకమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ తొలగించే అవకాశం ఉందంటూ ఫాలోవర్లను టెలిగ్రామ్‌ ఛానల్‌కు మళ్లించినట్లు సమాచారం. అక్కడే అసలు మోనిటైజేషన్‌ ప్రయత్నం మొదలైనట్లు వైరల్‌ పోస్టులు చెబుతున్నాయి.

వీడియో చూడాలంటే చెల్లింపు?

టెలిగ్రామ్‌లో రివీల్‌ వీడియోను చూడాలంటే 250 టెలిగ్రామ్ స్టార్స్, అంటే సుమారు రూ.500 చెల్లించాలని కోరినట్లు ప్రచారం జరిగింది. భారీగా హైప్‌ చేయబడిన రివీల్‌ను చూడాలనే ఆసక్తితో పలువురు చెల్లించినట్లు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అయితే చెల్లింపు చేసిన తర్వాత మరో కౌంట్‌డౌన్‌ కనిపించి.. చివరకు సాధారణమైన మోటివేషనల్‌ వీడియో ప్రత్యక్షమైనట్లు పలువురు యూజర్లు ఆరోపించారు. ఆ వీడియోలో ప్రధానంగా మీ సమయాన్ని వృథా చేయకండి.. సమయం తిరిగి రాదు అనే సందేశం ఉన్నట్లు పోస్టులు పేర్కొన్నాయి.

కోట్ల రూపాయలు వసూలయ్యాయా?

ఇక్కడే అసలు వివాదం మొదలైంది. సుమారు 1.66 లక్షల మంది చెల్లించారని, ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.500 తీసుకుంటే మొత్తం రూ.8.3–8.5 కోట్ల వరకు వసూలై ఉండొచ్చని సోషల్‌ మీడియాలో లెక్కలు వైరల్‌ అయ్యాయి. అయితే ఈ మొత్తం అధికారికంగా నిర్ధారించబడలేదు. కొన్ని డిజిటల్‌ విశ్లేషణలు అందుబాటులో ఉన్న ఛానల్‌ వ్యూస్‌, ఇతర గణాంకాల ఆధారంగా సుమారు రూ.5.61 కోట్ల వసూళ్లు జరిగి ఉండవచ్చని అంచనా వేశాయి. అందువల్ల రూ.8.5 కోట్ల వసూళ్లను ప్రస్తుతం ఖచ్చితమైన వాస్తవంగా చెప్పలేం.

స్కామా? లేక మార్కెటింగ్‌ స్టంటా?

ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందుగా భారీ రివీల్‌ అంటూ నమ్మించి డబ్బులు తీసుకుని నిరాశపరిచారని కొందరు దీనిని డిజిటల్‌ స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ప్రేక్షకుల ఆసక్తి, FOMOను ఉపయోగించుకున్న ఒక వివాదాస్పద మార్కెటింగ్‌ ప్రయోగం మాత్రమేనని అంటున్నారు. అయితే అసలు వసూళ్లు ఎంత? చెల్లించిన మొత్తం ఎక్కడికి వెళ్లింది? రివీల్‌ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? వంటి ప్రశ్నలకు స్పష్టమైన అధికారిక సమాధానాలు ఇంకా లేవు. సైబర్ పోలీసులు దీనిపై విచారణ జరిపి అసలు నిజాలు వెల్లడిస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Follow Us