ఇండియాలో యాపిల్ అమ్మకాలు రికార్డు గరిష్ఠ స్థాయిని చేరాయి. సెప్టెంబర్ 2024 తో ముగిసిన త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాల ద్వారా యాపిల్ కు భారత్ నుంచి వస్తోన్న ఆదాయం ఆల్ టైమ్ హై స్థాయికి చేరిందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ తో పాటూ ఐప్యాడ్ అమ్మకాలు కూడా రెండెంకల వృద్ధిని సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న డిమాండ్ ను సూచిస్తుందని పేర్కొన్నారు. కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్లు అంటే రూ.7.9 లక్షల కోట్లుకు చేరినట్లు తెలిపారు. భారతదేశంలో యాపిల్ ప్రొడక్టులకు ప్రజాధారణ పెరిగిందని కుక్ సంతోషం వ్యక్తం చేశారు.
యాపిల్ Q4 ఆదాయం మార్కెట్ అంచనాలను మించిపోయాయి. ఐఫోన్ 16 సిరీస్ ప్రారంభ అమ్మకాలతో కంపెనీ $94.93 బిలియన్లు నమోదు చేసింది. ఇది వాల్ స్ట్రీట్ అంచనా $94.58 బిలియన్ల కంటే కొంచెం ఎక్కువగా, సంవత్సరానికి 6 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అయితే చైనాలో ఊహించిన దానికంటే కాస్త తక్కువ ఫలితాలు సాధించింది.
అమెరికా, యూరప్, ఆసియా పసిపిక్ తో పాటు యూఎస్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, కొరియా.. మలేషియా, థాయిలాండ్ సహా పలు దేశాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఆదాయాలు ఆర్జించాం.. భారత్ నుంచి వచ్చే ఆదాయంలో సరికొత్త రికార్డును నెలకొల్పాం అని కుక్ పేర్కొన్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే మరో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు టిమ్ కుక్ తాజాగా ప్రకటించారు.
భారత్‌లో మరో నాలుగు స్టోర్స్
ప్రస్తుతం, భారతదేశంలో ముంబైలో యాపిల్ బికెసి మరియు న్యూఢిల్లీలోని యాపిల్ సాకేత్ రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. యాపిల్ ఇటీవల ప్రకటించిన విస్తరణ వ్యూహానికి అనుగుణంగా మరో నాలుగు స్టోర్స్‌ను భారత్‌లో ఏర్పాటు చేయనుంది. బెంగళూరు, పూణే, ముంబై మరియు ఢిల్లీ-NCRలలో స్టోర్లు ఏర్పాటు చేయనుంది.