House Construction: 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? 3 రకాల బడ్జెట్లు మీ కోసం!
House Construction: ఇల్లు కట్టడం ప్రారంభించే ముందే మీ బడ్జెట్ ఎంత, ఎటువంటి నాణ్యతతో ఇల్లు కావాలి అని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ప్రతి దశలోనూ ఖర్చులను అంచనా వేసి, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే, చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు..

House Construction Cost: మీరు 150 గజాల స్థలంలో కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? అయితే, నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంటుంది. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు – ఇలా రకరకాల అంచనాలు వినపడుతుంటాయి. ఈ గందరగోళాన్ని నివారించడానికి, 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి అయ్యే నిజమైన ఖర్చును, అది మీ ఎంపికలను బట్టి ఎలా మారుతుందో తెలుసుకుందాం. అయితే సమాచారం డిల్డర్స్, మేస్త్రీలు అందించిన వివరాల ప్రకారం మాత్రమే. మీ ప్రాంతం బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఏరియాను బట్టి ఇసుక, సిమెంట్, మేస్త్రీలు, కూలీల ఖర్చు హెచ్చుతగ్గులు ఉంటాయని గుర్తించుకోండి. అయితే ఈ వివరాలు అంచనా మాత్రమేనని గమనించండి.
ముందుగా, 150 గజాల స్థలం అంటే ఎంత విస్తీర్ణం వస్తుందో చూద్దాం. ఒక గజం 9 చదరపు అడుగులకు సమానం కాబట్టి, 150 గజాలు అంటే 1350 చదరపు అడుగులు (150x 9 = 1350). ఈ 1350 చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతంలో మీరు ఎటువంటి నాణ్యతతో ఇల్లు నిర్మించుకుంటారు అనే దానిపై మొత్తం వ్యయం ఆధారపడి ఉంటుంది. నిర్మాణ నాణ్యత ఆధారంగా మేము మూడు ప్రధాన శ్రేణులను విభజించి, వాటి ఖర్చులను అంచనా వేద్దాం.
1. సాధారణ ఇల్లు (బడ్జెట్-ఫ్రెండ్లీ నిర్మాణం)
ఈ వర్గంలో లగ్జరీ కాకుండా, మరీ తక్కువ నాణ్యత కాకుండా, మధ్యస్థాయి మెటీరియల్స్‌తో ఇల్లు నిర్మిస్తారు. సాధారణ అవసరాలను తీర్చే, చూడటానికి చక్కగా ఉండే ఇంటికి ఇది సరైన ఎంపిక.
- చదరపు అడుగుల వ్యయం: సుమారు రూ. 1650.
- మొత్తం వ్యయం (1350 చ.అ.): రూ. 1650 x 1350 చ.అ. = రూ. 22,27,500.
- అంచనా శ్రేణి: రూ. 22 లక్షల నుండి రూ. 23 లక్షల వరకు.
- ఈ బడ్జెట్‌లో, ప్రాథమిక మెటీరియల్స్‌తో, నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఇల్లు సిద్ధం అవుతుంది.
2. స్టాండర్డ్ ఇల్లు (మధ్యస్థ నాణ్యత నిర్మాణం)
మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. సాధారణ ఇంటి కంటే కొంచెం మెరుగైన నాణ్యతతో, చక్కని ఫినిషింగ్‌తో ఇల్లు కట్టించుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం.
- మెటీరియల్స్: మంచి టైల్స్, బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వైర్లు, మెరుగైన బాత్రూమ్ ఫిట్టింగ్స్, మరీ లగ్జరీ కాకుండా, మధ్యస్థాయి నాణ్యత గల వస్తువులను ఉపయోగిస్తారు.
- చదరపు అడుగుల వ్యయం: సుమారు రూ. 2000.
- మొత్తం వ్యయం (1350 చ.అ.): రూ. 2000 x 1350 చ.అ. = రూ. 27,00,000.
- అంచనా శ్రేణి: రూ. 25 లక్షల నుండి రూ. 28 లక్షల వరకు.
- ఈ బడ్జెట్‌లో, ఆధునిక సదుపాయాలతో, చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉండే ఇల్లు నిర్మించవచ్చు.
3. ప్రీమియం ఇల్లు (లగ్జరీ నిర్మాణం)
జీవితంలో ఒక్కసారే ఇల్లు కడతాం కాబట్టి, అత్యుత్తమ నాణ్యతతో, లగ్జరీ సదుపాయాలతో ఇల్లు కావాలనుకునే వారికి ఈ ఎంపిక సరిపోతుంది.
- మెటీరియల్స్: గ్రానైట్ ఫ్లోరింగ్, హై-ఎండ్ ప్రీమియం టైల్స్, బ్రాండెడ్ డిజైనింగ్, అధునాతన బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటివి ఇందులో ఉంటాయి.
- చదరపు అడుగుల వ్యయం: సుమారు రూ. 3000.
- మొత్తం వ్యయం (1350 చ.అ.): రూ. 3000 x 1350 చ.అ. = రూ. 40,50,000.
- అంచనా శ్రేణి: రూ. 40 లక్షలకు పైగా.
- ఈ బడ్జెట్‌లో, అత్యున్నత స్థాయి సౌకర్యాలు, డిజైనింగ్‌తో కూడిన విలాసవంతమైన ఇంటిని పొందవచ్చు.
అదనపు ఖర్చులు
పైన పేర్కొన్న అంచనాలు కేవలం నిర్మాణ వ్యయానికి సంబంధించినవి. ఇవి కాకుండా, కొన్ని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి, వీటిని చాలా మంది విస్మరిస్తుంటారు:
- ఆకస్మిక వ్యయాలు: నిర్మాణం జరిగేటప్పుడు డిజైన్‌లలో మార్పులు, మెటీరియల్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం వంటివి సాధారణం. ఇవి మీ బడ్జెట్‌కు అదనంగా రూ. 3-4 లక్షలు చేర్చవచ్చు.
- నిపుణుల రుసుములు: ఇంజనీర్, ఆర్కిటెక్ట్, వాస్తు పండితుల రుసుములు, లీగల్ ఖర్చులు వంటివి. వీటి కోసం అదనంగా రూ. 1-2 లక్షలు కేటాయించాల్సి ఉంటుంది.
- ఈ ఖర్చులన్నీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సాధారణంగా అమలులో ఉన్న రేట్లు. బిల్డర్లు సాధారణంగా ఈ అంచనాలతోనే పనులు చేసి ఇస్తారు.
ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇల్లు కట్టడం ప్రారంభించే ముందే మీ బడ్జెట్ ఎంత, ఎటువంటి నాణ్యతతో ఇల్లు కావాలి అని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ప్రతి దశలోనూ ఖర్చులను అంచనా వేసి, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే, చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు.
