బ్రేకింగ్: మూడో రోజు సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు.. శాసనసభలో తీవ్రమైన రగడ.. చంద్రబాబు వాకౌట్

|

Dec 02, 2020 | 4:46 PM

టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. వరుసగా మూడో రోజు కూడా స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. మార్షల్స్ వారిని సభ నుంచి బయటికి తరలించారు.

బ్రేకింగ్: మూడో రోజు సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు.. శాసనసభలో తీవ్రమైన రగడ.. చంద్రబాబు వాకౌట్
Follow us on

TDP MLAs suspended again: ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య రగడ తీవ్రమైంది. దాంతో వరుసగా మూడో రోజు కూడా విపక్ష టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అంతకు ముందు పోలవరం అంశంపై శాసనసభలో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టులో గత చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. దాంతో సభలో గందరగోళం ఏర్పడింది.

పోలవరం ప్రాజెక్టు అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. బుధవారం సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ ద్వారా 1343 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విపక్ష టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆరోపణలను నిరూపించాలంటూ టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు.

సభా కార్యక్రమాలను కొనసాగనీయకుండా టీడీపీ సభ్యులు పోడియంలో బైఠాయించి, నినాదాలు చేయడంతో వారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కోరారు. దాంతో తొమ్మిది మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైన టీడీపీ సభ్యులను మార్షల్స్ బయటికి తరలించారు. మిగిలిన టీడీపీ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు.. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.  గత డాక్యుమెంట్లను ఉదహరిస్తూ ముఖ్యమంత్రి పోలవరం ప్రోగ్రెస్‌ను సభకు వివరించారు.

ALSO READ: పవన్ కల్యాణ్ తాజా డిమాండ్