Big News Big Debate: క్రిప్టో.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. భౌతికరూపం లేని ఈ వర్చువల్ కరెన్సీ భారతదేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో పెట్టుబడి మంచిదేనా? అసలు దీన్ని నిషేధించాలా? లేదంటే నియంత్రిస్తే సరిపోతుందా? ప్రభుత్వం కూడా ఎటూ తేల్చేకోలేకపోతోంది. క్రిప్టోను షేర్ మార్కెట్లా నియంత్రిస్తే చాలంటున్నారు కొందరు ఎనలిస్టులు. కాదుకాదు ఇది యువతను ప్రమాదంలోకి నెడుతోంది బ్యాన్ చేయాలంటున్నారు ఇంకొందరు ప్రభుత్వ పెద్దలు. మొత్తానికి బిల్లు అయితే శీతాకాల సమావేశాల్లో వస్తోంది. మరి ఇంతకీ బిల్లులో ఏం ఉండబోతుంది.
క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. వందకు పైగా దేశాల్లో ట్రేడింగ్ జరుగుతుంది. కానీ చాలా దేశాల్లో నియంత్రణ లేదు. అయినా లక్షల కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో బిట్‌కాయిన్ చట్టాన్ని ఎల్‌సాల్వెడార్ ఆమోదించింది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలు బిట్‌కాయిన్‌కు చట్టబద్దత కల్పించాలని చూస్తున్నాయి. అమెరికా కూడా డెరివేటీవ్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ బ్యాంకులు కూడా బిట్ కాయిన్ వంటి పెద్ద క్రిప్టోలను అనుమతించడానికి సిద్దమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 14వేలకు పైగా క్రిప్టోలు అందుబాటులో ఉన్నాయి. 2లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ క్యాప్ సొంతం కలిగిన వర్చువల్ కరెన్సీలో బిట్ కాయన్ వాటనే దాదాపు 40శాతానికి పైగా ఉంది.
భారతదేశంలో గత ఏడాదిలో క్రిప్టో ఇన్వెస్టిమెంట్ 600శాతానికి పైగా పెరిగింది. 2 కోట్ల మంది ఇండియన్స్ క్రిప్టోలో పెట్టుబడులు పెట్టినట్టు అంచనా. అంతేకాదు రూ.8లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ఎక్చేంజి ట్రేడింగ్ కంపెనీలు వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. నియంత్రణ లేకపోవడంతో ఉండే ప్రమాదాలపై అటు RBI, ఇటు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. దీని కోసం అంతర్జాతీయ చట్టం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. యువత కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రైవేటు క్రిప్టో కరెన్సీ దేశ ఆర్ధిక వ్యవస్థ సుస్థిరతకు ప్రమాదంగా మారుతందని హెచ్చరించారు RBI గవర్నర్ శక్తికాంత దాస్.
క్రిప్టో కరెన్సీని మనీ లాండరింగ్, స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారనే అనుమానాలున్నాయి. 2018లో ఒకసారి బ్యాన్ చేసినా సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ వచ్చింది. తాజాగా నియంత్రణ విషయంలో ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెలాఖారులో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 అనే బిల్లును తెచ్చేందుకు రెడీ అయింది కేంద్రం. మరి క్రిప్టో కరెన్సీని నిషేధిస్తుందా? లేక నియంత్రణ విధిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే నియంత్రణకు మొగ్గుచూపితే దీనిని సెబీ పరిధిలోకి తీసుకొస్తారా? లేక RBI పరిధిలో ఉంటుందా చూడాలి.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..