ఇంధనమే భారమైందా? అప్పులే గుదిబండగా మారాయా?
నష్టాలతో RTCకి కష్టాలు ఇంకెంత కాలం?
ప్రగతి రథం పరుగులకు ప్రైవేటీకరణే మార్గమా?
ప్రభుత్వాలు ఆదుకోవడం సాధ్యం కాదా?
ఒకప్పుడు పేరుకు తగ్గట్టు ప్రగతిరథ చక్రాలుగా వర్ధిల్లిన RTC ఇప్పుడు పతనం అంచుకు చేరుతోంది. పెరుగుతున్న అప్పులు, అడ్డు అదుపులేని డీజిల్ భారం సంస్థల నడ్డి విరుస్తున్నాయన్నది ఓపెన్ సీక్రేట్. ఇది చాలదన్నట్టు వచ్చి పడిన కరోనా మరిన్ని నష్టాలకు కారణమైంది. RTCలను నిలబెట్టడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. మళ్లి లాభాల బాట పట్టించడం సాధ్యమయ్యే పనేనా.. కార్గో, కమర్శియల్ యాడ్స్ వంటి ప్రయత్నాలు చేసినా ఆదాయం అంతంతగానే వస్తోంది. మరి బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులతో తెలుగు రాష్ట్రాల్లో చక్రాలు మళ్లీ దూకుడుగా పరుగులు తీస్తాయా.
ఒకప్పుడు కళకళలాడిన ఆర్టీసీ కనీవినీ ఎరుగని కష్టాల్లో కూరుకుపోయింది. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకుంటూ, సమస్యలను అధిగమించుకుంటూ సాగితే పరిస్థితి వేరుగా ఉండేది. ఏడాది ఏడాదికి పనితీరు దిగజారి మరింత దుస్థితికి చేరుతోంది. కరోనాటైం కోలుకోలేని దెబ్బ తీసింది.
కరోనా తగ్గి ఆదాయం పెరుగుతుందని సంతోషం కూడా లేకుండా పోయింది. పెరిగిన వ్యయం సంస్థను కునుకు లేకుండా చేస్తోంది. డీజిల్ ధరలు, ఉద్యోగుల వేతనాలు RTCకి పెనుభారం అయింది. ఆదాయంలో సగం డబ్బులు డీజిల్‌పై పన్నులకే ఖర్చు అవుతున్నాయి. ఇక గతంలో ఉద్యోగులకు ప్రకటించిన ఫిట్మెంట్, అటు మధ్యంతర భృతి కూడా అదనపు భారం. ఆదాయం తగ్గడం.. ఖర్చులు పెరగడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం నెలకు 90 కోట్ల వరకూ నష్టాలు వస్తుండగా.. అటు అప్పులు కూడా 6వేల కోట్లు దాటాయి. ఉద్యోగుల ప్రయోజనాల కోసం కూడా వందల కోట్ల బకాయిలున్నాయి.
నానాటికి దిగజారుతున్న పరిస్థితుల్లో TSRTCని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం ఇప్పటికే పూర్తి స్థాయి MDని నియమించగా.. ఇటీవలే సంస్థకు ఛైర్మెన్‌ను కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. గత మూడేళ్లుగా సంస్థను ఆదుకునేందుకు CM KCR ప్రభుత్వం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే వస్తోంది. ఇప్పుడు కూడా 56 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సంస్థ అప్పులు, ఆస్తుల వివరాలు సేకరించి ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్ చేస్తోంది. కార్గో ప్రారంభించిన తర్వాత సంస్థ ఆదాయం పెరిగింది. మరికొన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఇక ఆర్టీసీ శాశ్వతంగా గట్టెక్కాలంటే టికెట్ రేట్లు పెంపు అనివార్యం అంటోంది ప్రభుత్వం. మరి సర్కారు ముందున్న ఆప్షన్లు అన్నీ పరిశీలించి త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామంటున్నారు. కొత్తగా ఖర్చులు పెంచుకోకుండా… ఉన్న వాటితోనే నిలబెట్టడం తమ ముందున్న లక్ష్యం అంటున్నారు RTC ఛైర్మన్.
అటు ఏపీలోనూ ఇందుకు భిన్నంగా పరిస్తితి లేదు. APSRTCకి రోజుకు 16 కోట్ల వరకు రాబడి రావాల్సి ఉండగా చాలావరకు తగ్గింది. కరోనా సమయంలో సంస్థ 4వేల కోట్ల వరకూ నష్టపోయినట్టు చెబుతున్నారు. ఆర్టీసీకి పలు బ్యాంకుల్లో4 వేలకోట్ల అప్పులున్నాయి. వీటికి ఏటా 350 కోట్లకుపైగా వడ్డీలు కడుతోంది. కార్మికుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండటం వల్ల సంస్థపై భారం తగ్గినా.. పెరుగుతున్న డీజిల్ ధరలు పెనుభారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో తెలుగురాష్ట్రాల్లో ఒకప్పుడు ప్రగతిరథ చక్రాలుగా పేరు సంపాదించిన బస్సులు మళ్లీ పూర్తి స్థాయిలో పూర్వవైభవంతో నడవడం సాధ్యమేనా?– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.