AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకం అంటే ఏమిటి? జీవితంలో ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా చూపించుకోవాలట.. ఎందుకో తెలుసా?

Astrology Tips: జాతకం అంటే ఏమిటి? జన్మకుండలి ఎలా తయారవుతుంది? జీవితంలో ఏ సందర్భాల్లో తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు? జననం, వివాహం, సమస్యలు, శుభకార్యాల సమయంలో జాతక ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జాతకం అంటే ఏమిటి? జీవితంలో ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా చూపించుకోవాలట.. ఎందుకో తెలుసా?
Astrology Tips
Rajashekher G
|

Updated on: Jul 03, 2026 | 4:38 PM

Share

భవిష్యత్తులో ఏం జరగబోతోంది? జీవితంలో ఎదురయ్యే శుభాశుభాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తి దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే చాలా మంది జ్యోతిష్యశాస్త్రాన్ని విశ్వసిస్తూ, జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలకు ముందు జ్యోతిష్యులను సంప్రదిస్తుంటారు. అయితే సాధారణ రాశిఫలాల కంటే, వ్యక్తిగత జన్మ వివరాల ఆధారంగా రూపొందించే జాతకం (జన్మకుండలి) ద్వారానే మరింత వ్యక్తిగతమైన విశ్లేషణ సాధ్యమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి జాతకం అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు చూపించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జాతకం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, వారంతో పాటు జనన సమయం, జన్మస్థలం’ ఆధారంగా గ్రహస్థితులను గణించి రూపొందించే జ్యోతిష్య చార్ట్‌ను ‘జాతకం’ లేదా ‘జన్మకుండలి’ అంటారు. దీని ఆధారంగా విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అనేక అంశాలపై జ్యోతిష్య విశ్లేషణ చేస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, శిశువు జన్మించిన వెంటనే పండితులతో జాతకాన్ని తయారు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతి కుటుంబంలో ఈ సంప్రదాయం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జన్మకుండలి తయారీకి ఏ వివరాలు అవసరం?

ఖచ్చితమైన జాతక విశ్లేషణ కోసం ఈ వివరాలు తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి
  • జనన తేదీ
  • జనన నెల, సంవత్సరం
  • ఖచ్చితమైన జనన సమయం
  • జన్మస్థలం

వీటిలో ముఖ్యంగా జనన సమయం అత్యంత కీలకం. ఎందుకంటే అదే లగ్నాన్ని నిర్ణయిస్తుంది. లగ్నం ఆధారంగానే గ్రహస్థితులు, దశలు, భవిష్యత్ ఫలితాలను విశ్లేషించడం సాధ్యమవుతుందని ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవాలి?

ప్రతిరోజూ లేదా తరచూ జాతకం చూపించుకోవాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే జీవితంలో నాలుగు ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా జాతకం పరిశీలించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

1. జననం జరిగిన వెంటనే

శిశువు పుట్టిన తర్వాత తొలి దశలో జాతకాన్ని రూపొందించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. జాతకంలో ‘బాలారిష్ట దోషాలు లేదా ఇతర గ్రహదోషాలు’ ఉంటే, శాస్త్రోక్త శాంతి కార్యక్రమాలను తొలి ‘21 రోజుల్లో లేదా మొదటి ఏడాదిలోపే’ నిర్వహించడం ద్వారా దోష నివారణకు అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది.

2. వివాహానికి ముందు

వివాహం జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. అందుకే పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, అనుకూలతలు, దోషాలు, అవసరమైన పరిహారాలను తెలుసుకోవడం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. దీనివల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

3. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు

ఉద్యోగం రాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ ఆలస్యం, సంతాన సమస్యలు లేదా ఇతర క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు జాతకాన్ని పరిశీలించి, జ్యోతిష్యులు సూచించే పరిహారాలను చేయడం ద్వారా మానసిక ధైర్యం, మార్గదర్శకత్వం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

4. శుభకార్యాలకు ముందు

ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, వివాహం వంటి ముఖ్యమైన శుభకార్యాలకు ముందు జాతకాన్ని పరిశీలించి, అనుకూలమైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇలా చేయడం ద్వారా కార్యక్రమాలు శుభప్రదంగా సాగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

చివరగా, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వ్యక్తిగత జాతకం అనేది ఒకరి జనన సమయానికి సంబంధించిన గ్రహస్థితుల ఆధారంగా రూపొందే విశ్లేషణ. దీన్ని విశ్వసించాలా వద్దా? అనేది వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ, హిందూ సంప్రదాయంలో జాతకానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా జననం, వివాహం, జీవితంలో క్లిష్ట పరిస్థితులు, శుభకార్యాల వంటి సందర్భాల్లో జాతకాన్ని పరిశీలించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us