ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం లేదా? ఆర్థిక కష్టాలకు ఈ వాస్తు దోషాలే కారణం కావొచ్చు..!

Vastu Tips: ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా? నెల తిరిగేసరికి అనుకోని ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దీనికి కారణమవుతాయని నమ్ముతారు. ఇంతకీ ఆ నాలుగు తప్పులు ఏమిటి? ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? తెలుసుకుందాం.

ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం లేదా? ఆర్థిక కష్టాలకు ఈ వాస్తు దోషాలే కారణం కావొచ్చు..!
Vastu Tips For Lakshmi Kataksha

Updated on: Nov 07, 2026 | 11:44 AM

ఎంత సంపాదించినా నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదని చాలామంది బాధపడుతుంటారు. అనుకోని ఖర్చులు, కుటుంబ అవసరాలు, అప్పులు వంటి కారణాలతో సంపాదించిన మొత్తం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోతుంటుంది. అయితే చేతి నిండా సంపాదిస్తున్నా.. డబ్బులు జోబులో నిలవకపోవడానికి వాస్తు దోషాలు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం (Vastu Sasthra) ప్రకారం ఇంట్లోని కొన్ని ఏర్పాట్లు, వస్తువుల అమరిక కూడా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించినవిగా భావిస్తారు. ఇంట్లో వాస్తుపరంగా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ప్రతికూల వాతావరణానికి కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం, నీటి కుళాయిలు, వస్తువుల నిల్వ, ఈశాన్య దిశ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తారు. ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతాయని భావించే నాలుగు వాస్తు సంబంధిత అంశాలు (Vastu Tips) ఏమిటో తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అపరిశుభ్రత

వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన ద్వారం నుంచే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందువల్ల ఇంటి గుమ్మం దగ్గర చెత్తాచెదారం, పాత చెప్పులు, విరిగిపోయిన వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవాలి. ప్రధాన ద్వారం పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తారు.

ఇంట్లో నీటి కుళాయిలు లీక్ అవడం

ఇంట్లో ఏదైనా కుళాయి నుంచి నీరు నిరంతరం కారుతుంటే వెంటనే మరమ్మతు చేయించాలి. వాస్తు సంప్రదాయంలో నీటిని సంపదకు, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. కుళాయిల నుంచి నీరు వృథా కావడాన్ని ఆర్థిక నష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. అందుకే బాత్‌రూమ్, వంటగది, ఇతర ప్రాంతాల్లో నీటి లీకేజీలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరిచేసుకోవాలి. నీటి లీకేజ్ ఉన్నంత కాలంలో ఆ ఇంట్లో సంపద నిలవదని వాస్తుశాస్త్ర పండితులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈశాన్య దిశలో చెత్తాచెదారం ఉంచడం

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశ (North-East) ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా, ప్రశాంతంగా ఉంచాలని సూచిస్తారు. ఈశాన్య దిశలో పాత వస్తువులు, పనికిరాని సామాన్లు, చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కువ బరువైన వస్తువులను ఉంచడం కూడా మంచిది కాదని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి.

పాడైపోయిన వస్తువులు, ఆగిపోయిన గడియారాలు

చాలామంది ఇళ్లలో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన అద్దాలు, పగిలిన పాత్రలు, పనిచేయని గడియారాలను చాలాకాలం అలాగే ఉంచుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో ప్రతికూల వాతావరణానికి కారణమవుతాయని నమ్ముతారు. అందువల్ల ఉపయోగంలో లేని వస్తువులను తొలగించి ఇంటిని శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తారు.

ఆర్థిక స్థిరత్వం కోసం ఏం చేయాలి?

పైన సూచించిన వాస్తు చిట్కాలు పాటిస్తూనే.. ప్రతి నెల ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగాలి. ఆర్థిక స్థిరత్వానికి ఆదాయం, ఖర్చుల నియంత్రణ, పొదుపు, సరైన ఆర్థిక ప్రణాళిక ఎంతో కీలకం.

(ముఖ్య గమనిక: పైన పేర్కొన్న వాస్తు సూచనలు సంప్రదాయ నమ్మకాల ఆధారంగా అందించినవి. ఇవి ఆర్థిక సమస్యలకు శాస్త్రీయంగా నిరూపితమైన కారణాలు లేదా పరిష్కారాలు కావు)

Loading...
Unable to load recommendations.
Follow Us