ఏమో.. ఏంటో కానీ.. ఈ ఏడాది ఏపీని వర్షాలు అల్లాడిస్తున్నాయి. అల్పపీడనాలు, తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎప్పుడు ముసురు పట్టి పంటలు నాశనం అవుతాయో అని రైతులు అనునిత్యం ఆందోళన చెందుతున్నారు. తాజాగా పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం టెన్షన్ పెడుతోంది. దీని ప్రభావంతో.. సోమవారం నుంచి గురువారం వరకు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. దీంతో ముందు జాగ్రత్తగా పోర్టల వద్ద 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. నేటి నుంచి గురువారం వరకు వేటకు వెళ్లొద్దని జాలర్లకు సూచించారు.
తీవ్ర అల్పపీడనం ప్రయాణం అంచనా వేయడం కష్టతరంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం.. పూర్తిగా బలహీన పడుతుందని భావించారు. కానీ అల్పపీడన ప్రయాణం గందరగోళంగా ఉండటంతో.. కదలికలను అంచనా వేయడం కష్టతరంగా మారింది. తాజాగా అల్పపీడన అవశేషాలు.. ఆంధ్రాలోని దక్షిణ కోస్తా, తమిళనాడువైపు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుందంటున్నారు. అయితే అల్పపీడనం తీరం దాటుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..