క్షణికావేశం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది..అత్త కాటికి.. కటకటాల్లోకి వెళ్లిన కోడలు..!

అత్తాకోడళ్లు అంటేనే కలహాల కాపురం అంటుంటారు. కానీ, ఆ కలహాలు హద్దులు దాటితే ఎంతటి ఘోరానికి దారితీస్తాయో చెప్పడానికి అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ. చిన్న విషయానికే విచక్షణ కోల్పోయిన ఓ కోడలు అత్తపై చేసిన దాడి, చివరకు అత్తను కాటికి.. తనను కటకటాల్లోకి నెట్టింది. ఈ విషాదకర ఘటన చోడవరంలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

క్షణికావేశం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది..అత్త కాటికి.. కటకటాల్లోకి వెళ్లిన కోడలు..!
Daughter In Law Arrested

Edited By:

Updated on: May 29, 2026 | 9:48 PM

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ తన కుమారుడు లక్ష్మణరావు, కోడలు నాగమణి మరియు మనవడితో కలిసి నివాసం ఉంటోంది. అయితే, ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలపై మనస్పర్థలు, గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఇటీవల కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే అత్తాకోడళ్ల మధ్య మాటామాటా పెరిగింది.

ఈ ఘర్షణ కాస్తా పెద్దది కావడంతో కోడలు నాగమణి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. క్షణికావేశంలో విచక్షణ మరిచి ఇంట్లో ఉన్న కర్ర చెక్క (దుడ్డు కర్ర) తీసుకుని అత్త పసలమ్మపై బలంగా దాడి చేసింది. ఈ దాడి కారణంగా పసలమ్మ ఎడమచేతికి నాలుగు చోట్ల తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. భార్య చేస్తున్న దాడిని చూసి భయపడిన కొడుకు లక్ష్మణరావు కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్థులు వెంటనే స్పందించి గాయపడిన పసలమ్మను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

అత్తపై దాడి చేసిన అనంతరం కోడలు నాగమణి భయంతో తన పుట్టింటికి పారిపోయింది. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసలమ్మ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. తల్లి మరణంతో లక్ష్మణరావు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, పసలమ్మ మృతికి కోడలు నాగమణే కారణమని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. పుట్టింట్లో తలదాచుకున్న నిందితురాలు నాగమణిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

చిన్నపాటి కోపం, క్షణికావేశం తెచ్చిన ముప్పు వల్ల అత్త ప్రాణాలు కోల్పోగా, కోడలు జైలుపాలైంది. అటు తల్లికి, ఇటు అమ్మమ్మకు దూరమై ఆ చిన్నారి మనవడు ఒంటరివాడయ్యాడు. ఈ ఒక్క ఘటన రెండు కుటుంబాలను కోలుకోలేని ఆవేదనలోకి నెట్టేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us