
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 450 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, మొత్తం 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 303 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదరగా.. సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత ఊతం లభించనుంది. మరోవైపు ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కీలక వివరాలు వెల్లడించారు. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏపీకి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. తాజాగా సీఐఐ సమ్మిట్‌లో ప్రకటించిన రూ.9.89 లక్షల కోట్లతో కలిపి మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనల్లో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాల అనుమతులు లభించాయని, వీటి విలువ రూ.17.10 లక్షల కోట్లు అని వివరించారు. అలాగే రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణ దశకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమలుగా మారేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ సీఐఐ సమ్మిట్‌లో మరో ఆసక్తికర అంశం కూడా చోటుచేసుకుంది. ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చే అంశంపై మంత్రి నారా లోకేష్, నటుడు రానా దగ్గుబాటి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందని రానా ప్రశ్నించారు. దీనికి స్పందించిన లోకేష్.. విశాఖకు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్లుగా వైజాగ్‌లోనూ సినిమా నిర్మాణానికి అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేవలం షూటింగ్స్ మాత్రమే కాకుండా స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్, ఇతర సినిమా సంబంధిత కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు.
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ ఈ సందర్భంగా కోరారు. దీనిపై స్పందించిన రానా.. విశాఖలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదగడానికి స్టూడియోలు, నిర్మాణ సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కీలక పాత్ర పోషించాయని కూడా ఆయన వివరించారు. దీంతో విశాఖలోనూ అలాంటి సినీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసే అంశంపై చర్చ ఆసక్తికరంగా మారింది. మొత్తంగా విశాఖ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల పరంగా కీలక వేదికగా నిలిచింది. భారీ పెట్టుబడి ప్రతిపాదనలు, అంతర్జాతీయ సంస్థల ఆసక్తి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఆశలు చిగురించాయి. మరోవైపు విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటుపై లోకేష్, రానా చేసిన చర్చ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పెట్టుబడి ప్రతిపాదనలన్నీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమవుతాయి? ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి