
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ తెల్లవారుజామున అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతం ఆగ్నేయ దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అండమాన్ దీవులుకు 700 కి. మీ., చెన్నైకు 860 కి. మీ. విశాఖపట్నంకు 1040 కి. మీ., గోపాల్‌పూర్ ఒడిశాకు 1160 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై కొనసాగుతోంది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతు వాయుగుండం మరింత బలపడుతుంది. రేపటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం తుఫానుగా మారాక ఇరాన్ దేశం సూచించిన అక్వాన్‌గా నామకరణం చేస్తారు.
తుపాను కాస్తా మరింత బలపడి 17న (మంగళవారం) పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశముందని IMD తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రేపటిలోగా తీరానికి చేరుకోవాలని సూచించింది. ఈనెల 18 నుంచి ఏపీపై వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండి తెలిపింది.
18న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 19న శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్. పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, ఏలూరు,ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 19 రాత్రి తర్వాత ఏపీలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే.. తీవ్ర తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.