Andhra Pradesh: హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి.. కేసును పోలీసులు ఎలా చేధించారంటే..

కృష్ణవేణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు హరికృష్ణబాబు విశాఖపట్నంలోని ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు గెడ్డ నాగేంద్రప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండలో ఇంటీరియర్ డిజైనర్ గా వ్యాపారం చేస్తున్నాడు. అలా ఇద్దరు కొడుకులు కృష్ణవేణికి దూరంగా ఉంటున్నారు...

Andhra Pradesh: హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి.. కేసును పోలీసులు ఎలా చేధించారంటే..
Ap News
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Aug 17, 2024 | 11:15 PM

విజయనగరం జిల్లాలో దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ హత్య కేసును చేధించారు పోలీసులు. బొబ్బిలి మండలం ముగడ కాలనీలో ఈ నెల 11 న జరిగిన మహిళ హత్య జిల్లాలో సంచలనం రేపింది. గెడ్డ కృష్ణవేణి అనే 62 ఏళ్ల వృద్ధురాలు బొబ్బిలి మండలం ముగడ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటుంది. కృష్ణవేణి భర్త గెడ్డ నారాయణప్పలనాయుడు హెడ్మాస్టర్ గా పనిచేసి 2018లో రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది నెలలకు అనారోగ్యంతో మృతి చెందాడు. అలా భర్త మరణంతో కృష్ణవేణి ఒంటరిగానే నివాసం ఉంటుంది.

కృష్ణవేణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు హరికృష్ణబాబు విశాఖపట్నంలోని ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు గెడ్డ నాగేంద్రప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండలో ఇంటీరియర్ డిజైనర్ గా వ్యాపారం చేస్తున్నాడు. అలా ఇద్దరు కొడుకులు కృష్ణవేణికి దూరంగా ఉంటున్నారు. అయితే తరచూ తల్లి కృష్ణవేణి వద్దకు వచ్చి యోగక్షేమాలు తెలుసుకొని ఆమె బాగోగులు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 12వ తేదీ ఉదయం కృష్ణవేణి ఇంటికి తాళం వేసి ఉండటం, ఆ ఇంట్లో నుండి గ్యాస్ లీకైన వాసన రావడం గమనించిన ప్రక్కంటిలోని అనసూయమ్మ అనే మహిళ పాలకొండలో నివాసం ఉంటున్న కృష్ణవేణి చిన్న కుమారుడు నాగేంద్ర ప్రసాద్ కు కాల్ చేసి చెప్పింది.

‘మీ అమ్మగారి ఇంట్లో నుండి గ్యాస్ వాసన వస్తుందని, ఇంటి బయట గడియ పెట్టి ఉందని’ తెలిపింది. వెంటనే నాగేంద్రప్రసాద్ అదే గ్రామానికి చెందిన తెలిసిన వారి సహాయంతో ఇంటి గడియ విరగ్గొట్టి చెక్ చేయించాడు. దీంతో ఇంటి మధ్య ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా పడి, ఒంటి మీద బంగారం లేకుండా కనిపించింది కృష్ణవేణి. వెంటనే అదే విషయాన్ని కృష్ణవేణి ఇద్దరు కొడుకులకు చెప్పడంతో వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ప్రాథమిక ఆధారాలు సేకరించి కృష్ణవేణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

తరువాత కొద్ది రోజులకు పోస్ట్ మార్టం నివేదిక రావడంతో కృష్ణవేణిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. అనంతరం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. అలా టెక్నాలజీ సహాయంతో మొబైల్ లోకేషన్ ఆధారంగా కలిశెట్టి లలిత అనే పాత నేరస్తురాలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. నిందితురాలు లలిత ముగడ కాలనీలోని కృష్ణవేణి ఇంటి సమీపంలో రెండు నెలల పాటు నివాసం ఉంది. ఆ సమయంలో కృష్ణవేణి కదలికలు గమనించింది. అనంతరం అక్కడ నుండి విశాఖలోని కంచరపాలెనికి మకాం మార్చింది లలిత.

అక్కడ నుంచి ఎవరికి అనుమానం రాకుండా ఆగష్టు 11వ తేదీ రాత్రి పది గంటల సమయంలో అందరూ ఇళ్ళల్లో నిద్రపోతూ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో కృష్ణవేణి ఇంటి తలుపు కొట్టింది. ఎవరో వచ్చారని తలుపు తెరిచింది కృష్ణవేణి. అప్పటికే ఆ వీధిలో ఉన్న నిందితురాలు లలిత కృష్ణవేణీతో పరిచయం ఉండటంతో ఇంట్లోకి పిలిచింది. అలా ఇంట్లోకి ప్రవేశించిన లలిత కొద్దిసేపు మాటల్లో పెట్టి వెంటనే ఆమె దగ్గర ఉన్న చున్నీతో గొంతు నులిమి చంపింది. కృష్ణవేణి మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఇంటి పై ఉన్న సుమారు పద్నాలుగున్నర తులాల బంగారం అపహరించింది. తరువాత సిలిండర్ గ్యాస్ లీక్ చేసి గ్యాస్ లీకై మరణించినట్లు చిత్రీకరించి ఇంటి బయట తాళం వేసి వెళ్ళిపోయింది. అలా నిందితురాలు కృష్ణవేణిని బంగారం కోసం దారుణంగా హతమార్చి పరారైంది. పోలీసులు దర్యాప్తు చేసి లలితను అరెస్టు చేసి బంగారం రికవరీ చేశారు. ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా ఎస్ పి వకుల్ జిందాల్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..