CM Chandrababu: ఏపీలో బంపర్‌ విక్టరీ.. తెలంగాణపై చంద్రబాబు ఫోకస్‌

|

Jul 07, 2024 | 6:22 PM

ఏపీలో బంపర్‌ మెజార్టీతో విక్టరీ కొట్టిన చంద్రబాబు..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు. రాష్ట్రంలో మూలన పడ్డ సైకిల్‌ను..తిరిగి రేసులో పెట్టే పని ప్రారంభించారు. ఆ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. . తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని..త్వరలోనే ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేస్తానని భరోసా ఇచ్చారు..పార్టీ అధినేత.

CM Chandrababu: ఏపీలో బంపర్‌ విక్టరీ.. తెలంగాణపై చంద్రబాబు ఫోకస్‌
CM Chandrababu
Follow us on

ఏపీలో టీడీపీతో కూడిన ఎన్డీఏ కూటమి బంపర్‌ విక్టరీ సాధించడంతో… ఆ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. సీఎం రేవంత్‌తో భేటీకోసం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులు చెప్పిన గ్రాండ్‌ వెలకమ్‌ చూస్తే.. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిన టీడీపీ క్యాడర్‌లో.. కాస్త జోష్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, తాజాగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చినప్పుడు కూడా.. అధినేతకు అదేస్థాయిలో స్వాగతం పలికింది క్యాడర్‌.

చాలారోజుల తర్వాత తెలంగాణ టీడీపీ నేతలను, కార్యకర్తలను కలిసిన చంద్రబాబు.. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పుట్టిన టీడీపీని.. మళ్లీ పునర్నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు. నాయకులు వెళ్లిపోయినా.. కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారన్నారు చంద్రబాబు.

తనకు రెండు తెలుగు రాష్ట్రాలూ రెండు కళ్లలాంటివన్నారు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే తెలంగాణ సీఎంతో చర్చలు ప్రారంభించామన్న చంద్రబాబు.. వాటిని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానన్నారు.

2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోవడం, తర్వాత అరెస్టు వంటి పరిణామాలతో చంద్రబాబు..తెలంగాణ టీడీపీ గురించి ఆలోచించలేకపోయారు. దీంతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దిగలేదు..తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడం, కేంద్రంలో కూడా శాసించే పరిస్థితుల్లో ఉండడంతో..తెలంగాణలో పార్టీని రీస్టార్ట్‌ చేసే యోచన చేస్తున్నారు చంద్రబాబు. ఓ వైపు వరుస ఓటములు, నేతల వలసలతో బీఆర్ఎస్ బలహీనపడుతుండడం..మరోవైపు టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..