Cinema Chettu: గోదావరి ఒడ్డున కూలిన సినీ వృక్షాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం

దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ వృక్షం ఇప్పటి వరకు సుమారు 300లకు పైగా సినిమాల్లో కనిపించింది. ఈ నిద్ర గన్నేరు మహా వృక్షానికి పునర్ఝమ్మ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెట్టుకు పునరుజ్జీవం పోసేందుకు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమహేంద్రవరం ఐకాన్స్‌ ఛార్టర్‌ ముందుకొచ్చింది.

Cinema Chettu: గోదావరి ఒడ్డున కూలిన సినీ వృక్షాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం
Cinema Chettu
Follow us

|

Updated on: Aug 09, 2024 | 5:58 PM

ఏదైనా ఒక ఊరికి పేరు వచ్చిందంటే వెనుక ఓ కథ ఉంటుంది. ఆ ఊరి నుంచి ఎవరో ఒకరు చెట్టంత ఎత్తు ఎదిగి ఉండాలి… కానీ కుమారదేవం గ్రామానికి ఓ చెట్టే పేరు తెచ్చిపెట్టింది. గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది.. అంటూ సాగే సినిమా పాటను చూసి ఈ చెట్టు గురించి మాట్లాడుకోవాలో లేదంటే… ఈ చెట్టునే స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెలియదు కానీ.. సినిమా చెట్టుగా ఫేమస్ అయిన మహా వృక్షం ఇటీవల కూలిపోయింది. అయితే ఈ చెట్టును మళ్లీ నిలబెట్టాలని అటు సినిమా వాళ్లు, ఇటు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అది సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు. రెండు వైపులా ఉన్న కొమ్మల బరువుతో, వేర్ల దగ్గర గోదారి కోతతో ఈ చెట్టు రెండుగా చీలిపోయింది. చెట్టు వేళ్లతో సహా కూలిపోతే దానికి మళ్లీ పునరుజ్జీవనం పోవయడం కష్టం.. కానీ ఆ చెట్టు కూలిపోయినా వేర్లు ఇంకా భూమిలో బ్రతికే ఉన్నాయి. అంటే అది మళ్లీ చిగిర్చే అవ‌కాశం ఉంది. దాన్ని నిలబెడితే ఓ చరిత్ర నిలబడుతుందని ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ చెట్టు కథను చెప్పాలంటే.. మరో సినిమా తీయొచ్చేమో. ఎందుకంటే…! తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే ఈ చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు… సినీ పక్షులకు కూడా షూటింగ్‌ స్పాట్‌గా మారింది. ఆ చెట్టును కదిలిస్తే, చాలా సినిమా కథలు చెబుతోంది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అల్లుకుపోయాయి. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్‌. అక్కడ సినిమా తీస్తే సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకం. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి నిన్నమొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు కిందే షూట్‌ జరిగాయి. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి.

దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారంట. వంశీ తీసిన 22 సినిమాల్లో 18 సినిమాల్లో చెట్టు సీన్ ఉంటుంది. ఈ చెట్టు కూలిపోవడంతో ద‌ర్శకుడు వంశీ భావోద్వేగానికి గుర‌య్యారు. సినిమా చెట్టును పరిశీలించి… చెట్టుతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వృక్షం తిరిగి చిగురించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ చెట్టు నిలబెట్టడానికి రాజమండ్రి రోటరీ క్లబ్ బృందం ముందుకొచ్చింది. చెట్టు వేరుకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టు నిలబెట్టేందుకు నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రణాళిక పూర్తి అవడానికి సుమారు 45 నుంచి 60 రోజులు సమయం పడుతుందని ఈ చెట్టును కచ్చితంగా బతికించి తీరుతామని రోటరీ క్లబ్ బృందం సభ్యులు తెలిపారు. ఇప్పటికే 15 చెట్లను పునరుద్ధరించామన్నారు.

ఈ చెట్టు కుమారదేవం గ్రామస్తులకు మూడుపూటల భోజనం పెట్టింది. ఈ చెట్టు దగ్గర సినిమా షూటింగ్‌లు జరిగితే కుమారదేవం గ్రామస్తులకు ఉపాధి దొరికేదని స్థానికులు గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ చెట్టు కూలిపోవడంతో ఇంట్లో మనిషిని కోల్పోయినంత బాధగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూలిపోయిన చెట్టుకు మళ్లీ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ స్థానికులు పూజాలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..