AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై టీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు.. పార్టీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఇకపై మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై టీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు.. పార్టీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్!
Pawan Kalyan Divorce
Balaraju Goud
|

Updated on: Nov 10, 2026 | 12:49 PM

Share

అమరావతి, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఇకపై మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, విమర్శలు, పోస్టులపై ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలు ఈ అంశంపై సంయమనం పాటించాలని కీలక ఆదేశాలు జారీ చేశాయి.

వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు వద్దు.. ఐటీడీపీ కీలక ప్రకటన

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ స్పష్టం చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టడం, విమర్శలు చేయడం, అనవసర చర్చలు నిర్వహించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది.

సోషల్ మీడియాలో పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చేసే వ్యక్తిగత వ్యాఖ్యలకు ఐటీడీపీ బాధ్యత వహించదని పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ విధానాలకు విరుద్ధంగా, అనుచితంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని, రాజకీయ విమర్శలకు వ్యక్తిగత జీవితాలను వేదికగా మార్చుకోవద్దని సూచించింది.

నేతలు, కార్యకర్తలకు వైసీపీ కీలక ఆదేశాలు!

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. అయితే, సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ శ్రేణులకు సూచించింది. ఇలాంటి అంశాలపై పోస్టులు పెట్టడం, ఇతరులు పెట్టిన పోస్టులకు స్పందించడం, కామెంట్లు చేయకూడదని ఆదేశించింది.

అంతేకాకుండా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడం, ప్రచారం చేయడం, అనవసర చర్చలకు దిగడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. పార్టీ నేతలు, క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తలందరూ ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. బహిరంగ సమాచార ప్రసారంలో సంయమనం, బాధ్యతాయుతమైన వైఖరి ప్రదర్శించాలని కోరింది.

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం!

సాధారణంగా టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా యుద్ధాలు కొనసాగుతుంటాయి. అయితే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంపై రెండు పార్టీలు తమ శ్రేణులకు దాదాపు ఒకే తరహా సూచనలు చేయడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పవన్ కల్యాణ్ దంపతులు తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరగా, మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ నాయకుల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలనే సందేశం ఈ పరిణామాల ద్వారా వెలువడుతోంది. ఇకపై సోషల్ మీడియాలో ఈ అంశంపై పార్టీ శ్రేణులు ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us