Mahalaya Amavasya : స్మశానంలో అర్థరాత్రి మహాలయ అమావాస్య.. అనంతలో వింత జాతర

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Oct 06, 2021 | 11:04 AM

స్మశానం పేరు చెబితే అందరికీ ఒక భయం మొదలవుతుంది. అదే చీకటి పడితే స్మశానాల్లోకి వెళ్లాలంటే.. అందునా అమావాస్య రోజున..

Mahalaya Amavasya : స్మశానంలో అర్థరాత్రి మహాలయ అమావాస్య.. అనంతలో వింత జాతర
Mahalaya Amavasya

Follow us on

Festival at Burial ground: స్మశానం పేరు చెబితే అందరికీ ఒక భయం మొదలవుతుంది. అదే చీకటి పడితే స్మశానాల్లోకి వెళ్లాలంటే.. అందునా అమావాస్య రోజున.. రాత్రి వేళల్లో స్మశానాలకు వెళ్లాలంటే… ఎలా ఉంటుంది చెప్పండి.. కానీ ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఊరు మొత్తం స్మశానం వైపు అడుగులు వేస్తున్నారు. చిమ్మచీకట్లు కనిపించే స్మశానాల్లో దీపాల కాంతులు.. జాతరను తలపించేలా జనం. చిన్న పిల్లలు, మహిళలు మొదలుకొని వందలాది మంది జనం. ఇంతకీ ఎందుకు స్మశానాల్లో అంత జనం ఉన్నారు.. అమావాస్య రోజు వారు ఎందుకు అక్కడికి వెళ్తున్నారనే మూలాల్లోకి వెళ్తే..

ఏడాది ఒక్కసారి వచ్చే పండుగ.. అది కూడా మరే ప్రాంతంలో కనిపించని భిన్నమైన పండుగ. అమావాస్య రోజున జరుపుకునే అతి పవిత్రమైన పండుగ. అదే మహాలయ అమావాస్య. పితృదేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ. ఇంతకీ అమావాస్య రోజు పండుగేంటి అంటే… అది కూడా స్మశానాల్లో పండుగ జరుపుకోవడం ఏంటి అనుకుంటున్నారా.. ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇంతకీ ఏంటి ఈ పండుగ… మహాలయ అమావాస్య. ఇది ఒక ఉగాది, దసరా, దీపావళికి మించిన పండుగ. రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఈ పండుగ జరుపుకుంటారు. ఎవరు ఈ పండుగ జరుపుకుంటారంటే.. ఇక్కడ ప్రతి కులంలోనే రెండు వర్గాలు ఉంటాయి. అందులో ఒకటి నాముదార్లు, రెండవది మొడికాళ్లు. నాముదార్లు ప్రతిఏటా నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజున మహాలయ అమావాస్య పండుగ జరుపుకుంటారు. ప్రతి కుటుంబంలో చనిపోయిన తమ పెద్దల కోసం నిర్వహించే పూజ ఇది.

ఈ పండుగ మిగిలిన అన్ని పండుగలకన్నా భిన్నం. ఇంట్లో పితృదేవల చిత్ర పటాలకు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. అక్కడ వారికి దుస్తులు, ఇష్టమైన తిండి పదార్థాలు, ఒక వేళ మద్యం సేవించే వారు అయితే మద్యం కూడా అక్కడ పెడుతారు. ప్రధానంగా నాన్ వెజ్ ను ఎక్కువగా నైవేద్యంగా పెడుతారు. ఇలా తమ పెద్దల వద్ద పూజ ఏర్పాటు చేసి.. కుటుంబసభ్యులంతా కలసి.. స్మశానానికి వెళ్తారు. అదేంటి స్మశానానికి ఎందుకంటే.. తమ పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహించేందుకు వెళ్తారు. అమావాస్య రోజు అయినప్పటికీ తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి.. అక్కడ పూజలు చేస్తారు. ముందుగా సమాధులను శుభ్రం చేసి పూలహారాలు వేసి, దీపాలు వెలిగించి వారికి ఇష్టమైన నాన్ వెజ్ లేదా ఇతర వంటకాలను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల సంఖ్యలో స్మశానాలకు తరలివస్తారు.

కేవలం పురుషులే కాదు.. మహిళలు, చివరకు చిన్న పిల్లలు కూడా తరలివస్తారు. ఈ సమయంలో విద్యుత్ దీపాలతో పాటు, సమాధుల వద్ద వెలిగించే దీపాలతో స్మశానం ఒక వైకుంఠంలా కనిపిస్తుంది. ఈ సమయంలో స్మశానం మొత్తం తమ కుటుంబ పెద్దల పేర్లు చెప్పుకుని గోవిందా గోవిందా అన్న నామస్మరణలే వినిపిస్తాయి. ప్రతి ఒక్కరూ నామం ధరించి ఎంతో పవిత్రంగా తమ పెద్దలకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో తమ పెద్దలు పై నుంచి ఆహార పదార్థాలు తిని తమను ఆశీర్వదిస్తారని నమ్మకం.

ఇలా అమావాస్య రోజున స్మశానానికి రావడం భయం లేదా అంటే ఎందుకు భయం మా పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు.. ఇది ఒక వైకుంఠం అని చెబుతారు. మొత్తం మీద ఏడాదిలో ఈ ఒక్కరోజు స్మశానం ఒక వైకుంఠాన్ని తలపిస్తుంది.

Read also: Modi Cabinet Ministers Assets: మోదీ కేబినెట్లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్.. ప్రధాని రూటు సెపరేటు. ఎవరెవరి ఆస్తులు ఎంతెంత పెరిగాయంటే.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu