నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మల సత్రం వద్ద గల బాలికల సమీకృత హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ చేసింది. హాస్టల్ కిచెన్ రూమ్‌లో పామును గమనించిన విద్యార్ధులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే నాగుపాము సంచారంపై స్పందించిన హాస్టల్ సిబ్బంది.. కర్రతో నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపడం వివాదంగా మారింది. హాస్టల్‌కు కూత వేటు దూరంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసు కార్యాలయం ఉంది. ఫారెస్ట్ అధికారులను సంప్రదించకుండా నాగుపామును కొట్టి చంపారు హాస్టల్ సిబ్బంది. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు హాస్టల్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు.
సోషల్ మీడియాలో నాగుపాము కొట్టి చంపిన దృశ్యాలు చూసి వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ప్రక్కన ఉన్న ఫారెస్ట్ రెస్క్యూ టీంను సంప్రదించకుండా ఇలా కొట్టి చంపడం ఏంటని ప్రశ్నిస్తూన్నారు. పామును చంపిన అనంతరం అ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ఏంటని మండిపడుతున్నారు. బాధ్యలైన వారిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తూన్నారు.