ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు. సోమవారం గన్నవరంలో జరిగిన ఘటన.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు కన్నా లక్ష్మీనారాయణ. ఈనెల 23న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. సుమారు 2 వేల మంది కార్యకర్తలు, అనుచరులతో కలిసి టీడీపీలో చేరతానన్నారు. మరికొందరు నాయకులు కూడా తనతో పాటు టీడీపీలో చేరతారని కన్నా చెప్పారు.
మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరినా తనకేమీ అభ్యంతరం లేదన్నారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. పార్టీలోకి వచ్చినా ఆయనస్థానం ఆయనకు.. తన స్థానం తనకు ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు రాయపాటి.
అటు కన్నా వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు చాలామంది సైలెంట్ అయ్యారు. కేవలం సోము వీర్రాజు.. జీవీఎల్ మాత్రమే స్పందించారు.. సోము వీర్రాజు అయితే తనపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోను అంటూ తేల్చిచెప్పారు. జీవీఎల్ మాత్రం కన్నా తీరును తప్పుపట్టారు. ఆయన వెళ్లినంతమాత్రన పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..