Kalipatnam Ramarao: తెలుగు కథకు ‘చిరునామా’ ఇచ్చిన ‘కథానిలయ’ స్వాప్నికుడు ‘కారా’ మాస్టారు ఇక లేరు!

|

Jun 04, 2021 | 2:38 PM

Kalipatnam Ramarao: అనగనగా ఓ కథ.. గతంలో కంచికి పోయేది. కానీ, అక్కడకు పోయిన తరువాత ఎవరికీ దొరకదేమో అని ఒక మాస్టారు బెంగెట్టుకున్నారు. అన్ని కథలూ కంచికి పోయి కనబడకుండా పోతే ఎలా అనే బాధ ఆయన్ని నిలబడనీయలేదు.

Kalipatnam Ramarao: తెలుగు కథకు చిరునామా ఇచ్చిన కథానిలయ స్వాప్నికుడు కారా మాస్టారు ఇక లేరు!
Kalipatnam Ramarao
Follow us on

Kalipatnam Ramarao: అనగనగా ఓ కథ.. గతంలో కంచికి పోయేది. కానీ, అక్కడకు పోయిన తరువాత ఎవరికీ దొరకదేమో అని ఒక మాస్టారు బెంగెట్టుకున్నారు. అన్ని కథలూ కంచికి పోయి కనబడకుండా పోతే ఎలా అనే బాధ ఆయన్ని నిలబడనీయలేదు. అబ్బే.. తెలుగు కథ ఎక్కడికీ పోవడానికి వీల్లేదు.. ఇక్కడే మన మధ్యే ఎప్పటికప్పుడు కొత్త పలుకులు నేర్చుకుంటూ.. నేర్పుతూ శాశ్వతంగా ఉండిపోవాలి. ఇదే ఆయన ధ్యేయం. తెలుగు భాషలో కథ అది ఎక్కడ రాసినదైనా.. ఎవరు రాసినదైనా ఒకే దగ్గర కొలువుతీరాలి. అదీ తెలుగు గడ్డ మీద కావాలి. ఇదే పట్టుదల.. అంతే.. తనకున్న చిన్న ఇంటినే తెలుగు కథకు అంకితం చేసేశారు. కథా నిలయంగా మార్చేశారు. ఇప్పుడు తెలుగు కథ కంచికి పోవడం లేదు. తన అక్షరాల సుమాల మాధుర్యాలను పంచుతూ ఆయన కథానిలయానికే చేరుతోంది. కానీ.. ఆయనే.. మనల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఆ కథా నిలయ స్వాప్నికుడు ‘కాళీపట్నం రామారావు’. అందరికీ ‘కారా’ మాస్టారిగా చిరపరిచితులు. కాదు కాదు.. తెలుగు కథకు చెరగని చిరునామాగా సుపరిచితులు. ఆయన ఇక మన మధ్య లేరు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన.. శ్రీకాకుళంలోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

కారా మాస్టారు.. కథా ప్రేమికుడు!

కారామాస్టారి గురించి చెప్పడం అంటే.. అందమైన తెలుగు కథను చదివినట్టే. ఆయన 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం మురపాకలో ఆయన జన్మించారు. శ్రీకాకుళంలో ఎస్ఎస్ఎల్సీ వరకూ చదివారు. తరువాత భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1948 నుంచి 31 ఏళ్ల పాటు ఒకే ఎయిడెడ్ స్కూల్ లో ఒకే స్థాయిలో ఉద్యోగం చేశారు కారా మాస్టారు. 1972 నుంచి ఇప్పటివరకూ ఆయన పెన్షన్ మీదే ఆధారపడి జీవితాన్ని గడుపుతున్నారు. కారా మాస్టారికి కథ అంటే ప్రాణం. ఈయన స్వతహాగా సరళ భాషా రచయిత. కథకుడు. విమర్శకుడు. ఆయన ఉపాధ్యాయుడు కావడం వలన కావచ్చు.. సరళమైన రచనా శైలితో సామాన్య పాఠకులను కూడా ఇట్టే ఆకట్టుకునే వారు.

యజ్ఞం తో కథా యాగం.. ఆయన తెలుగు కథకు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. “యజ్ఞం” కథా రచయితగా కాళీపట్నం రామారావు సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఆ కథ అప్పట్లో సంచలనం కలిగించింది.

కారా మాస్టారి గురించి క్లుప్తంగా..

  • తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా ఆయన జీవితం అంతా నిర్విరామంగా కృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు.
  • ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను పొందాయి.
  • ఆయనకు అవార్డుల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు.
  • తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మాస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు.
  • అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు.
  • కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు సుప్రసిద్ధాలు.
  • 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
    అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదనేది కారామాస్టారు ఆశయం.

కారా మాస్టారి జీవన చిత్రం – విశాఖ శిఖరాలు నుంచి

తెలుగు కథకు నీడా.. గోడా ‘కథానిలయం’

కాళీపట్నం రామారావు మాస్టారు గారి స్వప్నం కథానిలయం. ఆయన భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు.

కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు – గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా – ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.

1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో సుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కారా మాస్టారు చెప్పేవారు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా మాస్టారు అంటారు.

కథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా మాస్టారు నిమగ్నమై ఉండేవారు. కారా స్వీయ రచనలు వివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురించారు. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కథానిలయానికే చెందుతుంది.
నివాళులర్పించిన సాహితీ లోకం..

కారా మాస్టారు కథానిలయం లోని ప్రతి కథలోనూ కనిపిస్తారు. భౌతికంగా ఆయన లేకపోవచ్చు కానీ, ఆయన తెలుగు వారి భావితరాలకు కూర్చి ఉంచిన కథా సంపద తెలుగు సాహిత్యం మనుగడలో ఉన్నంత వరకూ కారా మాస్టారిని మన మధ్యనే ఉంచుతుంది. ”మాస్టారు తన రచనలతో ఈ సమాజాన్ని మేల్కొలిపారు. తన ప్రతి అక్షరం పేద, సామాన్య మధ్యతరగతి ప్రజలను చైతన్యం చేసింది. కారా మాస్టారు మరణించారని అనుకోలేం. ఆయన ప్రతి తెలుగు కథకుడి కలం నుంచీ తన వాణిని వినిపిస్తూనే ఉంటారు” అంటూ ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ నివాళులర్పించారు.

చివరగా ఓ మాట.. కారా మాస్టారు యజ్ఞం అనే పేరుతో రాసిన రచన ఎంతగా సంచలనం సృష్టించిందో.. ఆయన యజ్ఞంలా చేసిన.. తన ఊపిరి పోయేంత వరకూ చేస్తూ వచ్చిన కథా సేవ ఆయన పేరున తెలుగుసాహితీ ప్రపంచంలో ఒక పేజీగా కాదు.. ఒక అధ్యాయంగా నిలిచిపోతుంది. పుస్తకాల్లో ప్రచురించే కథలే కాదు.. తన అనుభవాన్ని.. సమాజ పోకడల్ని.. ఇతరుల కష్ట నష్టాల్ని అక్షరాల రూపంలో పేర్చే ప్రతి వ్యక్తీ కారా మాస్టారి దృష్టిలో కథకుడే. సాహితీ పిపాసుడే. కథకు కొత్త నిర్వచనం.. కథా రచయితలకు గౌరవ రహదారి చూపించిన మార్గదర్శకుడిగా కారా మాస్టారు నిలిచిపోతారు.

Also Read: Corona Data: కరోనా ప్రతిరోజూ లెక్కల్లో మీరిది గమనించారా? ప్రతి సోమవారం కేసులు తక్కువగా కనిపిస్తాయి..ఎందుకంటె..

Long Life: ఇదే కానీ జరిగితే..మనిషి వందేళ్ళు కాదు నూట ఇరవై ఏళ్లు బ్రతికేస్తాడు..ఇజ్రాయిల్ శాస్త్రవేత్తల పరిశోధన!