కాకినాడ AE ఫ్యామిలీ మాస్ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. శాడిస్ట్ సాధిక్‌ అరెస్ట్‌!

కాకినాడ పంచాయతీరాజ్‌ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబాన్ని వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ షేక్‌ సాధిక్‌ఖాన్‌ దిల్లీలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఐదు రోజులుగా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలించిన అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య లేఖల్లో పేర్కొన్న ఆరోపణలతో పాటు..

కాకినాడ AE ఫ్యామిలీ మాస్ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. శాడిస్ట్ సాధిక్‌ అరెస్ట్‌!
Rifle Shooting Coach Sadiq Khan Arrest

Updated on: Aug 22, 2026 | 6:58 AM

కాకినాడ, ఆగస్ట్ 22: కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ షేక్‌ సాధిక్‌ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఐదు రోజులుగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా.. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన తనిఖీల్లో సాధిక్‌ఖాన్‌ పట్టుబడ్డాడు. నిందితుడు సాధిక్‌ఖాన్‌ను పట్టుకునేందుకు పోలీసులు 10 మంది ఎస్సైలు సహా సుమారు 40 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో ఢిల్లీలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లోనే అతడు పోలీసులకు చిక్కాడు. అతడిని ఆదివారం నాటికి కాకినాడకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం అతడిని విచారించి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టే అవకాశం ఉంది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నూకరాజు కుమార్తె సౌజన్యతో సాధిక్‌ఖాన్‌ సన్నిహితంగా ఉండేవాడని, ఆమెకు సంబంధించిన ప్రైవేటు విషయాలు, ఫొటోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల కారణంగానే నూకరాజు కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఈ నెల 16న అర్ధరాత్రి నూకరాజు కుటుంబ సభ్యులు గోదావరి నదిలో దూకారు. ఈ ఘటనకు ముందు నూకరాజు తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ లేఖ రాసి, దానిని వాట్సప్‌లో పోస్టు చేశాడు. ఈ కేసులో మరో కీలక ఆధారంగా సౌజన్య పేరుతో లభించిన లేఖను పోలీసులు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. తన భర్తకు విషం ఇచ్చి సాధిక్‌ చంపేశాడని, తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నూకరాజు రాసిన లేఖతో పాటు సౌజన్య పేరుతో లభించిన లేఖ ఆధారంగా రాజమహేంద్రవరం రెండో పట్టణ, కాకినాడలోని సర్పవరం పోలీస్‌ స్టేషన్లలో సాధిక్‌ఖాన్‌పై కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనతో పాటు.. ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతికి సాధిక్‌ఖాన్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టనున్నారు. నిందితుడిని కాకినాడకు తీసుకువచ్చిన అనంతరం విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాధిక్‌ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు, కుటుంబ సభ్యుల లేఖల్లో పేర్కొన్న అంశాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us