తిరుమలలో ముదురుతున్న మఠాల వ్యవహారం.. పోరాటానికి పిలుపునిచ్చిన జనసేన..

| Edited By: Srikar T

Jun 29, 2024 | 2:30 PM

తిరుమలను మఠాల వ్యవహారం కుదిపేస్తోంది. మఠాల అక్రమ కట్టడాలు, నిర్వహణ వ్యవహారాలపై జోరుగా చర్చ నడుస్తోంది. ముఠాలకు కేంద్రాలుగా మఠాలు మారిపోయాయంటున్న జనసేన పోరాటం.. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మఠాల నిర్మాణాలను తప్పుపడుతూ కొందరు స్వాజీలు సైతం ప్రత్యక్ష నిరసనలకు దిగడంతో కొండమీద మఠాల ఇష్యూ ముదిరింది.

తిరుమలలో ముదురుతున్న మఠాల వ్యవహారం.. పోరాటానికి పిలుపునిచ్చిన జనసేన..
Tirumala
Follow us on

తిరుమలను మఠాల వ్యవహారం కుదిపేస్తోంది. మఠాల అక్రమ కట్టడాలు, నిర్వహణ వ్యవహారాలపై జోరుగా చర్చ నడుస్తోంది. ముఠాలకు కేంద్రాలుగా మఠాలు మారిపోయాయంటున్న జనసేన పోరాటం.. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మఠాల నిర్మాణాలను తప్పుపడుతూ కొందరు స్వాజీలు సైతం ప్రత్యక్ష నిరసనలకు దిగడంతో కొండమీద మఠాల ఇష్యూ ముదిరింది. తిరుమల అతిపెద్ద ధార్మిక క్షేత్రం. తిరుమలేశుడు కొలువైన వైకుంఠంలో పలు మఠాల నిర్మాణానికి టిటిడి అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం 33 వరకు మఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయం మేరకు శ్రీవారి నిత్య కైంకర్యాలు జరిగే తిరుమల క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచి మఠాల సంప్రదాయం వచ్చింది. రాయలవారి కాలంలో కర్ణాటకకు చెందిన వ్యాసరాయరు తిరుమల ఆలయ పర్యవేక్షణ చేపట్టగా క్రీస్తు శకం 1522 నాటి నుంచి 12 ఏళ్ల పాటు వ్యాసరాయులు పాలన తిరుమలలో సాగింది. ఈ మేరకు అప్పుడే వ్యాసరాజ మఠం తిరుమలలో ఏర్పడింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచితంగా భోజన వసతి కల్పించడం, మఠాధిపతులు తిరుమలకు వచ్చినప్పుడు సేద తీరేందుకు వీలుగా అప్పటి నుంచే ఈ మఠాల ఏర్పాటు అనివార్యమైంది.

ఇలా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుమలలో కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా మఠాల నిర్మాణం జరిగింది. ఆయా మఠాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు వెంకన్న దర్శనానికి వచ్చినప్పుడు పెద్ద మర్యాద, చిన్న మర్యాదలు చేపట్టాల్సి ఉండగా టిటిడి సైతం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమంలోపు ఇఫ్తికపాల్ మర్యాదలు ఆయా మఠాల సాంప్రదాయాల ప్రకారం టిటిడి ఇప్పటికే చేస్తోంది. ఇలా తిరుమలలో వసతి సౌకర్యం లేని రోజుల్లో భక్తులకు మఠాధిపతులు, పీఠాధిపతులకు వసతికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చారు. దీంతో క్రమంగా తిరుమలలో మఠాల ప్రాధాన్యత పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుమలలో తమ పలుకుబడికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయడంతో మఠాల సంఖ్య పెరిగింది. ఇలా 2004 వరకు తిరుమలలో 18 మఠాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 33 కు చేరుకుంది. ఈ మేరకు తిరుమలలో మఠాల నిర్మాణాలు, అవసరాలకు తగ్గట్టు మరమ్మత్తులు చేస్తుండటంతో అత్యాధునిక సౌకర్యాలతో మోడ్రన్‎గా మారిపోతున్నాయి. దీంతో తిరుమల మఠాల నిర్వహణపై గత కొన్నేళ్ళుగా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ప్రభుత్వ పెద్దలతో తమ పలుకుబడిని ఉపయోగించుకొని తిరుమలలో మఠాలను నిర్మించడం, ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న మఠాలను పునర్నిర్మాణం పేరుతో కట్టడాలు చేపట్టడం చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే విశాఖ శారదా పీఠం మఠం నిర్మాణ పనులు తెరమీదికి వచ్చింది. తిరుమలలో ఉన్న విశాఖ శారదా పీఠం 6 అంతస్తుల్లో చేపట్టిన విస్తరణ పనులపై వివాదం నెలకొంది. అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి శారదా పీఠం మఠాన్ని విస్తరిస్తోందని పక్కనే ఉన్న మరో మఠం కోర్టును ఆశ్రయించింది. దీంతో మఠాల నిర్మాణ పనులపై టిటిడి జోక్యం చేసుకుంది. గత ఏప్రిల్‎లో పనులను ఆపివేసింది. అయితే ఇప్పుడు విశాఖ శారదా పీఠానికి చెందిన మఠం అక్రమ కట్టడాలను ప్రశ్నిస్తూ జనసేన.. ప్రత్యక్ష పోరాటానికి దిగింది. తిరుమలలో మఠాల నిర్వహణ తీరును తప్పుపడుతోంది. రెండ్రోజుల క్రితం
తిరుమలలో విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించిన జనసేన నేతలు.. తిరుమలలో మఠాల పేరుతో కోట్లాది రూపాయల స్కాం జరుగుతోందని ఆరోపించారు. అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు జరుగుతున్నా టిటిడి అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిందని ఆధారాలతో అక్రమ నిర్మాణాలను బయటపెట్టిన జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్.. తిరుమలలో జరుగుతున్న మఠాల అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల ప్రక్షాళన మఠాల నుంచే ప్రారంభం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు స్వామీజీలు కూడా తిరుమలలో జరుగుతున్న శారదా పీఠం మఠం విస్తరణ పనులను తప్పుపడుతున్నారు. గోగర్భం డ్యాం వద్ద ఉన్న విశాఖ శారదా పీఠానికి చెందిన మఠం అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలంటూ శ్రీనివాసానంద సరస్వతితో పాటు మరికొందరు స్వామీజీలు హిందూ సంస్థలతో కలిసి నిరసనకు దిగారు. ఒకవైపు జనసేన నేతలు, మరోవైపు స్వామీజీలు నిరసనలు చేపట్టడంతో టీటీడీ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. మఠం నిర్మాణ పనుల వ్యవహారం కోర్టులో ఉందని టీటీడీ చెబుతోంది. తిరుమలలో మఠాల నిర్వహణ ధర్మ ప్రచారం లక్ష్యంగా కాకుండా ధనార్దనే ధ్యేయంగా సాగుతుందని జనసేన నేతల ఆరోపణలు చేస్తున్నారు. స్వామీజీల నిరసనలతో ముదురుతున్న మఠాల వ్యవహారాన్ని టిటిడి ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..