AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఇంట్లోనే ఆశ్రయం పొంది 4.5 తులాల బంగారం చోరీ!

సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటన మరోసారి నిరూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మహిళ నమ్మకంగా ఇంట్లోకి ప్రవేశించి, కుటుంబ సభ్యులతో కలిసిపోయి చివరకు బంగారు, వజ్రాల నగలు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అక్కయ్యపాలెం పరిధిలోని లలితానగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఇంట్లోనే ఆశ్రయం పొంది 4.5 తులాల బంగారం చోరీ!
Instagram Friend Decamps With Gold, Diamond Jewellery
Srilakshmi C
|

Updated on: Nov 17, 2026 | 7:31 AM

Share

విశాఖపట్నం, నవంబర్‌ 17: సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు మోసాలకు దారితీస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఇంట్లో ఆశ్రయం కల్పించిన ఓ కుటుంబం చివరకు నగలు పోగొట్టుకుంది. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసిపోయిన మహిళ అదను చూసి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం పరిధి లలితానగర్‌కు చెందిన మహేశ్వరి నీరజ తన భర్త, కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘స్మైలీ-క్వీన్’ అనే ఐడీ ద్వారా ప్రీతి అలియాస్ మధుప్రియ అనే మహిళ పరిచయమైంది. తాను రాయగడలో నివసిస్తున్నానని, విశాఖలోని డాబాగార్డెన్స్‌లో బంధువులు ఉన్నారని ప్రీతి తెలిపింది. అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నానని, రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నానని నమ్మించింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు తనను సరిగ్గా చూసుకోవడం లేదని ప్రీతి నీరజతో చెప్పుకుంది. ఈ క్రమంలో జూన్ 2న నీరజను కలిసింది. ఆమె పరిస్థితిని చూసి జాలిపడిన నీరజ తమ ఇంట్లో ఆశ్రయం కల్పించారు.

అప్పటి నుంచి ప్రీతి నీరజ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ వారిలో ఒకరిగా కలిసిపోయినట్లు నటించింది. దీంతో ఆమెపై కుటుంబ సభ్యులకు నమ్మకం ఏర్పడింది. దాదాపు మూడు నెలల పాటు అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగింది. వారి నమ్మకాన్ని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో బీరువాలో దాచిన డబ్బు, నగలు మాయమవుతున్నట్లు నీరజ గుర్తించారు. గతంలో బీరువాలో ఉంచిన రూ.20 వేలలో రూ.8,500 కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నవంబరు 11న ఇంటికి తిరిగి వచ్చి నగల పెట్టెను పరిశీలించగా బంగారు, వజ్రాల ఆభరణాలు కనిపించలేదు. సుమారు 50 గ్రాముల బంగారు నగలు, 11.3 గ్రాముల వజ్రాల హారం చోరీకి గురైంది. వజ్రాల హారం, లక్ష్మీదేవి లాకెట్లు, నల్లపూసలు కలిపి మొత్తం నాలుగున్నర తులాల బంగారం మాయమైనట్లు బాధితురాలు గుర్తించారు. నవంబరు 7న తన బంధువులతో దీపావళి వేడుకలు జరుపుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ప్రీతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమెకు ఫోన్ చేయగా బాధితురాలి నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు గుర్తించారు. దీంతో . ప్రీతి తనను నమ్మించి మోసం చేసిందని గ్రహించిన నీరజ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. ప్రీతి గతంలో ఓ ఎగ్జిబిషన్‌లో నకిలీ ఫోన్‌పే చెల్లింపు చేసి మోసానికి పాల్పడినట్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులను వెంటనే నమ్మి ఇంట్లో ఆశ్రయం కల్పించడం ఎంతటి ప్రమాదకరమో తెలియజేస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఆర్థిక పరిస్థితులు, ఇంట్లోని విలువైన వస్తువుల గురించి అపరిచితులకు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

Follow Us