WEF 2022: తెలుగు రాష్ట్రాలకు వెల్లువలా పెట్టుబడుల.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు..

| Edited By: Ravi Kiran

May 26, 2022 | 1:13 PM

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చివరి రోజు కావడంతో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ ప్రయత్నిస్తున్నాయి.

WEF 2022: తెలుగు రాష్ట్రాలకు వెల్లువలా పెట్టుబడుల.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు..
Ktr Ys Jagan
Follow us on

Andhra Pradesh -Telangana: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయి. స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు.. అనేక కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుష్మిత్‌ సర్కార్‌ ప్రకటించారు. ఏపీ విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని.. బైజూస్‌ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు. సమగ్ర భూసర్వే, రికార్డుల భద్రత, సాంకేతిక పరిజ్ఞానంపై కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు ఆశిష్‌ సింఘాల్‌తో సీఎం చర్చించారు. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు సింఘాల్‌. పర్యాటక రంగం అంశంపై ఈజ్‌మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టితో సీఎం చర్చించారు. ఏపీలో పర్యాటకరంగ అభివృద్ధికి చేయూతనిస్తామని, పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని తెలిపింది ఈజ్‌మై ట్రిప్‌.

యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా మారబోతోంది విశాఖ. దీనికోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు సీఎం జగన్‌. దావోస్‌లో స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈవోలు, కీలక అధికారులతో సమావేశమయ్యారు సీఎం. ఏపీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. దావోస్‌లో సీఎం జగన్‌ను కలిశారు ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఇటు తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. ఫ్యాక్టరీ ద్వారా తయారయ్యే రైల్వే కోచ్‌లను ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం సైతం ఎగుమతి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకొచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్‌. తాజాగా వెయ్యి కోట్ల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.