బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దమంటే చాలు మహిళలు ఎగిరి గంతేస్తారు. బంగారం కొనుగోలు, బంగారు ఆభరణాల అలంకరణ పై మహిళలకు మక్కువ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. పురుషులు సైతం తమ ఒంటిపై బంగారం ధరించడం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. దీన్నే కొందరు కేటుగాళ్లు అవకాశంగా మార్చుకున్నారు. కొత్త ప్యూహాలతో ప్రజలను కొందరు మోసం చేస్తున్నారు. తక్కువ ధరకే బంగారం లభిస్తుందని అత్యాశకు వెళ్లి మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటననే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో జరిగింది. తక్కువ ధరకు విదేశాల నుండి బంగారం తెప్పిస్తానని, ఆశ చూపించి పలువురిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
ఏలూరు జిల్లా పాత పట్టిసీమ గ్రామానికి చెందిన నరపురెడ్డి కనకయ్య మధురపూడి విమానాశ్రయంలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడు. అవివాహితుడైన కనకయ్య పెళ్లిళ్ల బ్రోకర్ అల్లాడి కునాల్‌ను పరిచయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు విదేశాల నుండి భారీగా బంగారం తెప్పిస్తున్నాననే నెపంతో 2024 ఫిబ్రవరి నుండి దఫా దఫాలుగా కనకయ్య వద్ద నుండి కునాల్ రూ.4.80 లక్షలు ఆన్‌లైన్లో తీసుకున్నాడు. అంతే కాకుండా కొవ్వూరులో మోటార్ బైక్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం మరో రూ.86 వేల రూపాయలు కూడా రాబట్టాడు. ఆతర్వాత కునాల్ పరారైయ్యాడు. విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్ వద్ద కునాల్ కనిపించడంతో కనకయ్య ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కునాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అపరిచిత వ్యక్తులను నమ్మి, తమ విలువైన జీవితాలను, డబ్బును కోల్పోతున్నారని ఆన్ లైన్ మోసాలకు గురికావద్దని పోలీసులు సూచించారు.