ఆపరేషన్ వశిష్టలో అంతా గందరగోళం.. “కచ్చులూరు కహానీ”..!

ఆపరేషన్ వశిష్టకు మరోసారి బ్రేకులు పడ్డాయి. తాత్కాలికంగా బోటును వెలికితీసే పనులు నిలిపివేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఉదయం నదిలోకి వెళ్లి లంగర్లు వేసి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో ధర్మాడి సత్యం బృందం అయోమయంలో పడింది. ఇటు అధికారులు బోటును వెలికితీసేందుకు కాకినాడ నుంచి మరో బృందం తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో కచ్చులూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:29 pm, Thu, 17 October 19
ఆపరేషన్ వశిష్టలో అంతా గందరగోళం.. "కచ్చులూరు కహానీ"..!

ఆపరేషన్ వశిష్టకు మరోసారి బ్రేకులు పడ్డాయి. తాత్కాలికంగా బోటును వెలికితీసే పనులు నిలిపివేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఉదయం నదిలోకి వెళ్లి లంగర్లు వేసి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో ధర్మాడి సత్యం బృందం అయోమయంలో పడింది. ఇటు అధికారులు బోటును వెలికితీసేందుకు కాకినాడ నుంచి మరో బృందం తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో కచ్చులూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.

ప్రస్తుతం కచ్చులూరులో బోటును వెలికితీసే పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాకినాడ టీం కచ్చులూరుకు చేరుకుంటుందని తెలుస్తోంది. రెండు రోజులుగా బోటును వెలికితీసే ప్రయత్నంలో నిమగ్నమైన ధర్మాడి సత్యం బృందం.. బోటుకు లంగర్లు వేసి బయటకు లాగి కట్టింది. గోదావరి నది ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో 120 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. సత్యం టీంలో దాదాపు 25 మంది ఎక్స్ పర్ట్స్, మరో 25 మంది మత్స్యకారులు ఉన్నారు. పూర్తి సాంప్రదాయ పద్దతిలోనే బోటును వెలికి తీయాలని భావించినా, తాజాగా అధికారుల ఆదేశాలతో వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఇంతకీ అధికారులు ఆపరేషన్ వశిష్టను ఎందుకు నిలిపివేశారు..? అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేయబోతున్నారన్న సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు బోటు వెలికితీత పనులు నిలిపివేయడంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులూ తూతూ మంత్రంగా బోటును వెలికితీస్తున్నట్లు హడావుడి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. బోటు ఆపరేషన్ పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అంటున్నారు.