శివరాత్రి వేళ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వెళ్లి వస్తుండగా మూడు బైకులు, ఒకదానిని ఒకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు చనిపోయాడు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం.. అరకులోయ మండలం నందివలస వద్ద శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారంతా అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. మహా శివరాత్రి సందర్భంగా అరకులోయ ప్రాంతంలోని నందివలస గ్రామంలో జాతర జరుగుతోంది. దీంతో చాలామంది జాతరకు హాజరయ్యారు. అలా జాతరకు వెళ్లి వస్తున్న క్రమంలో రెండు బైక్‌లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బైక్‌లపై ఉన్న వారిలో నలుగురు మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..