Train Accidents: మనం కొన్న రైలు టిక్కెట్ వెనక్కి తిప్పి చూస్తే.. మీ భద్రతే మా లక్ష్యం.. విషింగ్ యూ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ అని రాసుంటుంది. రైల్వేశాఖ మనకిస్తున్న భరోసా అది. కానీ.. అదంతా డొల్ల. రైలు ప్రయాణానికి ఉపక్రమించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు.. ప్రయాణీకుల భద్రతను మళ్లీమళ్లీ ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఇదే ఏడాది జూన్ 2న ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటన.. 296 మందిని బలితీసుకుని, 1200 మందిని ఆస్పత్రిపాలు చేసిన నాటి విషాదం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. దాన్నుంచి మన రైల్వే వ్యవస్థ గుణపాఠం నేర్చుకుంటూనే ఉంది.
అంతలోనే.. ఇదిగో ఆదివారం అక్టోబర్ 29 రాత్రి 8 గంటల సమయం.. విజయనగరం జిల్లాలో అటువంటిదే మరో ఘోరం. ఇక్కడ కూడా మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఒకదానిమీదొకటి ఎక్కి.. బోగీల్ని నుజ్జునుజ్జు చేసేశాయి. నిండుప్రాణాల్ని తీసుకెళ్లాయి. మూడు రైళ్లు- ఒక ఘోరం. కారణం కూడా ఒక్కటేనా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మరోసారి రైలు ప్రయాణీకుల గుండెల్లో దడ పుట్టించింది. ఒకే ట్రాక్‌పై ముందున్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్క ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలుపై బోగీలు ఎగిరిపడ్డాయి. అదొక భయానక దృశ్యం.
మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లోకోపైలట్ రావు, ట్రైన్ గార్డ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మరో 100 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైతే వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కొత్తవలస సమీపంలో భీమాలి దగ్గర విశాఖ-పలాస ప్యాసింజర్ సిగ్నల్ లేకపోవడంతో నెమ్మదిగా కదులుతోంది. వెనుక నుంచి వస్తున్న విశాఖ-రాయగడ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. పలాస ప్యాసింజర్ చివర్లో ఉన్న గార్డు బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి అనుకున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి… అవతలి ట్రాక్‌పై వెళ్తున్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఇటు.. పలాస ప్యాసింజర్‌ను ఢీకొట్టిన రాయగడ ప్యాసింజర్ ఇంజన్ పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదంలో 7 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చారు. నిన్న రాత్రి నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరిగింది. NDRF, SDRF, RPF సిబ్బంది రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం తర్వాత డౌన్ ట్రాక్‌పై ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
విజయనగరం రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మానవతప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు.
విశాఖ-రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ రైలు సిగ్నల్‌ను ఓవర్‌షూట్ చేసినట్టు అనుమానం
డెడ్‌స్లోగా వెళ్లాలన్న సిగ్నల్‌ను గమనించని లోకోపైలట్… వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం లేదని కూడా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… కంటకపల్లి దగ్గర ఆదివారం ఉదయం నుంచి సిగ్నలింగ్ సమస్య ఉంది. గతంలో కూడా చాలాసార్లు సిగ్నల్స్ ఫెయిల్ ఐంది. సరిచేయడం ఆలస్యం కావడం వల్లే రాయగడ ప్యాసింజర్‌కు సిగ్నల్ ఇవ్వలేకపోయి కూడా ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు.
ఒక రైలు ఒక స్టేషన్ నుంచి వెళ్లి తర్వాతి స్టేషన్ దాటేవరకు వెనక వచ్చే రైలుకు సిగ్నల్ ఇవ్వరు. కానీ.. భీమాలి దగ్గర పలాస ప్యాసింజర్ ఆగిపోయినా.. రాయగడ ప్యాసింజర్ కంటకపల్లి స్టేషన్ దగ్గర ఆగకుండా దూసుకెళ్లింది. ఇదెలా జరిగింది అనే కోణంలోనే అసలు దర్యాప్తు జరగనుంది.
సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమా, లేక సిగ్నల్ ఇచ్చినా లోకో పైలట్ నిర్లక్ష్యం చేసి ముందుకెళ్లారా అనేది లోతైన విచారణ తర్వాతే తేలేది.
అసలు కవచ్ లాంటి సూపర్‌టెక్నాలజీ ఉన్నా ప్రమాదాలు ఎందుకు రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. రైల్వే శాఖ భద్రతకు ప్రాధాన్యం పెంచాల్సి ఉందా, సేఫ్టీ సెక్షన్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టాల్సి ఉందా… లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందా… నిపుణులు ఏమంటున్నారు..?