“మున్సిపాలిటీలో ఉన్న కుక్కలన్నీ మా ఇంటి ముందు చేరాయి. ప్రతి వీధి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకొక్కసారి కుక్క కనిపిస్తే కమిషనర్ కనిపించడు..” పబ్లిక్‌గా ఈ మాటలు అన్నదీ ఎవరో కాదు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే కే ఈ పరిస్థితి వచ్చిందంటే సామాన్య జనానికి కుక్కల బాధ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి..!
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరులో పాల్గొన్నారు. కమిషనర్ గంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. కుక్కల సమస్యపై స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యేకి కోపం తలకెక్కింది. పక్కనే ఉన్న కమిషనర్ పైకి కోపం మళ్లింది. పై వ్యాఖ్యలు ఆయన సమక్షంలోనే చేశారు.
దీనిపై టీవీ9 లో ప్రముఖంగా ప్రచారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కమిషనర్ గంగిరెడ్డి కూడా స్పందించారు. సమస్య నిజమే. ప్రతి కుక్కకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. స్టెరిలైజేషన్ రాగానే ఆపరేషన్ చేసి కుక్కల సంఖ్య పెరగకుండా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మున్సిపల్ మినిస్టర్, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి వివరణ ఇచ్చామని కమిషనర్ గంగిరెడ్డి వెల్లడించారు. ఇప్పటి నుంచి కుక్కల సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..