మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య..అసలేం జరిగిందంటే..

క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం గరువు పల్లవపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్యం మత్తులో తలెత్తిన గొడవ, తండ్రీకొడుకుల ఆత్మహత్యకు దారితీయడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే...

మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య..అసలేం జరిగిందంటే..
Father And Son Suicide

Edited By:

Updated on: May 01, 2026 | 3:31 PM

మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకే కుటుంబంలో తండ్రీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం గరువు పల్లవపాలెంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మోకా నాగమల్లేశ్వరరావు (70) కుమారుడు వీర్రాజు (40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీర్రాజుకు మద్యం సేవించే అలవాటు ఉంది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో వీర్రాజు మద్యం తాగి ఇంటికి రావడంతో, తండ్రి నాగమల్లేశ్వరరావు అతని ప్రవర్తనను తీవ్రంగా మందలించాడు. తండ్రి మాటలకు మనస్తాపం చెందిన వీర్రాజు, క్షణికావేశంలో తన కళ్లముందే ఉన్న పురుగుల మందును తాగేశాడు.

కళ్లముందే తన కుమారుడు విషం తాగడం చూసి నాగమల్లేశ్వరరావు తల్లడిల్లిపోయాడు. ఆ ఆవేదనలో కొడుకు చేతిలోని మందును లాక్కొని, తాను కూడా సేవించాడు. ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో తణుకు, ఆపై మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్యలో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. గంట వ్యవధిలోనే ఇద్దరూ మరణించడం ఆ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. మృతుడు వీర్రాజు భార్య వరలక్ష్మి ప్రస్తుతం ఉపాధి కోసం కువైట్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్నట్టుండి తండ్రి, తాత ఇద్దరూ దూరం కావడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గరువు పల్లవపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం, క్షణికావేశం ఏ విధంగా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయో అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us