Andhra Pradesh: ఏపీకి మరో గుడ్ న్యూస్.. రూ. 95వేల కోట్ల పెట్టుబడితో కేంద్ర సంస్థ భారీ ప్రాజెక్ట్..!

| Edited By: Balaraju Goud

Dec 25, 2024 | 7:50 AM

మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరంలో 6వేల 100 కోట్లతో చేపట్టనున్నారు. రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ కమ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించింది. ప్రాజెక్టు ఏర్పాటుపై బీపీసీఎల్‌తో త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకోనుంది.

Andhra Pradesh: ఏపీకి మరో గుడ్ న్యూస్.. రూ. 95వేల కోట్ల పెట్టుబడితో కేంద్ర సంస్థ భారీ ప్రాజెక్ట్..!
Cm Chandrababu Naidu, Bpcl Cmd Krishna Kumar
Follow us on

మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టనుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – బీపీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం దశల వారీగా రూ.95వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందు కోసం ముందస్తు పనుల కోసం బీపీసీఎల్ బోర్డు రూ.6,100 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని బీపీసీఎల్ బోర్డు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)కి అధికారికంగా తెలియజేసింది.

రామాయం పట్నంలో భారీ ప్రాజెక్ట్

Bpcl

ఈ భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరం నెల్లూరు – ప్రకాశం జిల్లాల సరిహద్దు రామాయపట్నం పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సుమారు 5,000 ఎకరాల భూమి అవసరమవుతుంది. భూసేకరణకు రూ.1,500 కోట్ల ఖర్చు అయ్యే అవకాశమున్నట్లు అంచనా వేశారు. మొదటగా విడుదల చేయనున్న రూ. 6,100 కోట్లలో ఈ భూసేకరణ చేయనున్నారు. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలతో పాటు భూ సేకరణ, సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ, పర్యావరణ ప్రభావ అంచనా, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ మొదలైనవి చేపడతారని బీపీసీఎల్ వివరించింది.

విస్తృతంగా ఉపాధి అవకాశాలు

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐదు నుంచి పది సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణ సమయంలో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 5,000 మందికి శాశ్వత ఉపాధి లభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై బీపీసీఎల్ త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, బీపీసీఎల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు అధికార కూటమి చెబుతోంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు

ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం

ఈ ప్రాజెక్టు ద్వారా పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడంతోపాటు రాష్ట్రంలో పెట్రో కెమికల్ పరిశ్రమ అభివృద్ధికి ఇది కీలకంగా నిలవనుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక అధ్యయనం, భూమి గుర్తింపు, సేకరణ, ఫీజిబిలిటీ రిపోర్టు, పర్యావరణ ప్రభావం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రో కెమికల్ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని పొందనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడానికి మరియు పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదం కానున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..