
ఏలూరు : మన వంటింట్లో నిత్యం వాడే పసుపు గురించి అందరికీ తెలిసిందే. పసుపు రంగులో ఉండే ఈ దినుసు లేనిదే ఏ శుభకార్యమూ జరగదు.. ఏ వంటా పూర్తి కాదు. అయితే ఎప్పుడైనా లోపల ముదురు నీలం, నలుపు రంగులో ఉండే అరుదైన పసుపును చూశారా? శాస్త్రీయంగా ‘కుర్కుమా సీసియా’ అని పిలిచే ఈ ‘నల్ల పసుపు’ ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ నిధి. సాధారణ పసుపు కిలో వందల రూపాయల్లో పలుకుతుంటే, నాణ్యమైన నల్ల పసుపు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో సమానంగా కిలో వేల రూపాయలు పలుకుతుండటం విశేషం. అధిక లాభాలు ఉండటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో లాభాలెంత ఉన్నాయో, నకిలీ విత్తనాలు, మోసపూరిత ఒప్పందాల రూపంలో పొంచి ఉన్న ప్రమాదమూ అంతే ఉంది.
ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా అటవీ ప్రాంతాల్లో పెరిగే నల్ల పసుపు పైన చూసేందుకు సాధారణ పసుపులాగే గోధుమ రంగులో ఉన్నా, లోపల మాత్రం ముదురు నీలం, బూడిద-నలుపు రంగులో ఉంటుంది. సాధారణ పసుపు కంటే ఇందులో ‘కర్క్యుమిన్’ అనే మూలకం అత్యధిక మోతాదులో ఉండటం వల్ల ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు మైగ్రేన్ తలనొప్పి, చర్మ, జీర్ణకోశ సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మరోవైపు దీనికి ఆధ్యాత్మిక, తాంత్రిక ప్రాముఖ్యత ఉందని, ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకాలు కూడా ఉండటంతో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది.
నల్ల పసుపు సాగుకు కూడా సాధారణ పసుపు సాగు విధానమే వర్తిస్తుంది. ఉష్ణమండల, తేమతో కూడిన వాతావరణంతో పాటు నీరు నిలవని ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు లేదా ఇసుకతో కూడిన లోమ్ నేలలు (పి హెచ్ 5.5 నుండి 6.5 మధ్య) దీనికి అత్యంత అనుకూలం. బంకమట్టి నేలలు అస్సలు పనికిరావు. మే చివరి వారం నుండి జూన్ నెల వరకు విత్తన కొమ్ములు నాటుకోవడానికి సరైన సమయం.. ఆ తర్వాత కూడా అటు ఇటుగా నాటొచ్చు.. ఎకరాకు సుమారు 6 నుండి 8 క్వింటాళ్ల నాణ్యమైన విత్తన కొమ్ములు అవసరమవుతాయి. నాటే ముందు వీటిని కార్బెండజిమ్ లేదా ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలో 20 నుండి 30 నిమిషాల పాటు శుద్ధి చేసి నీడలో ఆరబెట్టాలి. మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల మధ్య 45 నుండి 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా ఎత్తైన బెడ్స్ పై నాటుకోవాలి. సేంద్రియ పద్ధతిలో ఎకరాకు 10 నుండి 15 టన్నుల పశువుల ఎరువు, వేప పిండి వేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది 8 నుండి 9 నెలల పంట కాబట్టి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయినప్పుడు తవ్వకాలు జరపాలి. ఎకరాకు పచ్చి కొమ్ములు 40 నుండి 50 క్వింటాళ్లు, ఎండబెట్టిన తర్వాత 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
అయితే.. నల్ల పసుపు (Curcuma caesia) సాగుకు పంట కాలం మొత్తం నేలలో తేమ సమానంగా ఉండేలా నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీరు నిలిస్తే దుంపలు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. పెద్ద ఎత్తున నీరు అవసరం లేదు..
అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తించడం ఎలా? నల్ల పసుపు పేరుతో మార్కెట్లో మామిడి అల్లం లేదా ఇతర అడవి దుంపలకు రంగులు వేసి విక్రయించే ముఠాలు సంచరిస్తున్నాయి. కాబట్టి విత్తనాలు కొనేటప్పుడే రైతులు అప్రమత్తంగా ఉండాలి. అసలైన నల్ల పసుపు కొమ్మును మధ్యకు విరిచినప్పుడు లోపలి భాగం కచ్చితంగా ముదురు నీలం లేదా బూడిద-నలుపు రంగులో ఉంటుంది. అంతేకాకుండా దీనిని కట్ చేసినా, నలిపినా సాధారణ పసుపు వాసన కాకుండా ఘాటైన కర్పూరం వాసన వస్తుంది. చిన్న ముక్కను నాలుకపై ఉంచితే తీవ్రమైన చేదు, ఘాటు రుచి తెలుస్తుంది.
ఇక మొక్క పెరిగిన తర్వాత ఆకుల మధ్య ఈనె పొడవునా ముదురు ఎరుపు, ఊదా రంగు గీత స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ పసుపు ఆకులు పూర్తిగా ఆకుపచ్చగా ఉంటాయి. నల్ల పసుపు వంటి అరుదైన ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ , రాష్ట్ర ఉద్యానవన శాఖలు జాతీయ ఆయుష్ మిషన్ , సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ కింద 30% నుండి 75% వరకు సబ్సిడీని అందిస్తున్నాయి. పంటను ఆరబెట్టే డ్రైయింగ్ షెడ్లు, గోదాముల నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, నర్సరీల ఏర్పాటుకు 100% వరకు గ్రాంట్లు పొందే వెసులుబాటు ఉంది.