ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంశంపై మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రానికి కర్నూలు, అమరావతి, విశాఖపట్నంను రాజధానులుగా చేస్తామంటున్నా.. కొందరు మాత్రం విశాఖపట్నం మాత్రమే రాజధాని అని చెబుతుండటం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనంటూ రైతులు చేస్తున్న మహాపాదయాత్ర – 2 సమయంలో మంత్రులు ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘అమరావతి వద్దు – విశాఖపట్నమే ముద్దు’ అనే ఒకే ఒక లక్ష్యంతో ఉత్తరాంధ్ర ప్రజలు ముందుకు కదలాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారన్న ఆయన.. దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే మన వారసులు, భవిష్యత్తు తరాల వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. వారు ఎప్పటికి మనల్ని క్షమించలేరని చెప్పారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, కొందరు రాజకీయ లబ్ధి కోసం అమరావతి రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని స్పీకర్ ఆరోపించారు.
సొంత లాభం కోసం మూడు రాజధానులను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం. అలాంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. విశాఖపట్నానికి ప్రపంచం, దేశం నలుమూలల నుంచి కనెక్టవిటీ ఉంది. జాతీయ రహదారులు, జల, వాయు, రైలు మార్గాలు ఉన్నాయి. అమరావతి లోతట్టు ప్రాంతం. ఏటా వరదలు వస్తాయి. మట్టి లూజుగా ఉండటం వల్ల భవనాల నిర్మాణాలు చేపట్టలేం.
– తమ్మినేని సీతారాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి
కాగా.. విశాఖ రాజధానిపై గతంలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలున్న ఏకైక పెద్ద నగరం విశాఖపట్నం అని, పాలన సౌలభ్యం కోసమే రాజధానిగా విశాఖను ఎంపిక చేశామని వివరించారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటాయని సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి అనేది ఆచరణ సాధ్యం కాని రాజధాని అని సీఎం జగన్ గతంలో స్పష్టం చేశారు.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.